-జులై 25, 26 తేదీల్లో ఉండవల్లి గుహల వద్ద ఘనంగా వేడుకలు..తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా మహోత్సవ నిర్వహణ
-సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వినితో కలిసి పోస్టర్ ఆవిష్కరణ
-మాతృభాషా పరిరక్షణకు యువత ముందుకు రావాలి..ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి దుర్గేష్ పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాతృభాష వైభవాన్ని, సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించాలనే ఉన్నతాశయంతో రాష్ట్రస్థాయిలో తెలుగు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని మంత్రి దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జులై 25, 26 తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల ప్రాంగణంలో జరగనున్న తెలుగు మహోత్సవం అధికారిక పోస్టర్‌ను మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ .. తెలుగు భాషా వైభవం, సాహిత్య సంపద, సాంస్కృతిక సౌందర్యం, కళా సంప్రదాయాలు, జానపద వారసత్వం మరియు సృజనాత్మకతలను ఒకే వేదికపైకి తెచ్చే అద్భుతమైన వేడుక ఈ తెలుగు మహోత్సవం అన్నారు.మాతృభాషలోని మాధుర్యాన్ని విద్యార్థులు, యువతీ యువకులు ఆస్వాదించేలా, నిత్య జీవితంలో వాడుకలోకి తెచ్చేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.ఆధునిక పోకడల్లో తెలుగు భాషా స్వరూపం తగ్గుతోందనే ఆందోళనను అధిగమించి మాతృభాష గొప్పతనాన్ని విశ్వవిఖ్యాతం చేసేందుకు ఈ ఉత్సవం దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమ వివరాలు వెల్లడిస్తున్న సమయంలో మంత్రి దుర్గేష్ సాహితీ సమరాంగ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు రచించిన దేశభాషలందు తెలుగు లెస్స అన్న భావంతో కూడిన తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను పద్యాన్ని స్వయంగా ఆలపించి, దాని తాత్పర్యాన్ని వివరించారు.మాతృభాష గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ మహా కార్యంలో విద్యార్థులు, యువత, తెలుగు భాషాభిమానులు, ప్రతి ఒక్కరూ విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News