-రాష్ట్ర ప్రభుత్వం- పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధ్య ఎంఓయూ
-సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలకమైన ప్రాజెక్టు ఏర్పాటుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందుకు వచ్చింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ లో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఏపీ క్వాంటం మిషన్-పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- పీఎన్ బీ సీఈఓ, ఎండీ అశోక్ చంద్ర సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలో బ్యాంకింగ్ రంగం కోసం ప్రత్యేకంగా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మొట్ట మొదటి బ్యాంక్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది. బ్యాంకింగ్ సేవల్లో సైబర్ భద్రతను పటిష్టం చేయటంతో పాటు ఆర్ధిక మోసాలను ముందుగా గుర్తించే వ్యవస్థ ఏర్పాటు, భవిష్యత్ డిజిటల్ ఆర్ధిక వ్యవస్థల్ని సురక్షితంగా నిర్వహించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తోంది. పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్టప్ లు, పరిశోధనా సంస్థలతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలను కూడా ఒకే వేదికపైకి తెచ్చేలా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ పని చేయనుంది. క్వాంటం కంప్యూటింగ్ సహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు, నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు అవసరమైన నైపుణ్యాలను కూడా పెంపొందించేలా ఈ హబ్ పని చేయనుంది.
డిజిటల్ లిటరసీపై ప్రత్యేక కార్యాచరణ
అమరావతిని క్వాంటం సహా డీప్ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చాలని సంకల్పించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏక్యూవీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్వాంటం ఏఐ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయటం మరో కీలకమైన మైలు రాయి అవుతుందని సీఎం అన్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే వినియోగదారులతో పాటు ప్రజలకు డిజిటల్ లిటరసీ పెంచే దిశగా కృషి చేయాలని ముఖ్యమంత్రి పీఎన్ బీ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వాలు- బ్యాంకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయటంలో టెక్నాలజీ మరింత విస్తృతమవ్వాలని సీఎం సూచించారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా డిజిటల్ లావాదేవీలకు భద్రతను అత్యుత్తమ స్థాయిలో అందించాలని సీఎం స్పష్టం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ ను మరింత పటిష్టంగా, సులభతరంగా సేవలు అందించేలా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈఓ ఎండీ అశోక్ చంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పీఎన్ బీ ఉన్నతాధికారులు, అమరావతి క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News