గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన పార్క్ ల స్థలాలను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సంయుక్త పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం పెద్దపలకలూరు, ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి రోడ్, విజయదుర్గా నగర్ తదితర ప్రాంతాల్లో జిఎంసి ఖాళీ స్థలాలను పరిశీలించి, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలనిఅధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో విస్తృతంగా జిఎంసి స్థలాలు ఉన్నాయని, వాటిని ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించే పార్క్ లు, వాకింగ్ ట్రాక్ లుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఒక్కో పార్క్ ఒక్కో థీమ్ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా చేస్తామన్నారు. ఇప్పటికే ఆయా స్థలాల గుర్తింపు పూర్తయిందని, ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించి, బౌండరీలు ఫిక్స్ చేసి, ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నివాసాలకు దూరంగా ఉన్న స్థలాలకు ఫెన్సింగ్ చేసి మొక్కలు నాటి, జిఎంసి బోర్డ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పార్క్ ల అభివృద్ధి అనంతరం వాటి నిర్వహణకు స్థానిక వాకర్స్ కమిటీలకు అప్పగిస్తామని తెలిపారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఈఈ వేణుగోపాల్, డిఈఈ శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News