-పోలియో టీకాపై కీలక పరిశోధనకు ‘ది లాన్సెట్’ గుర్తింపు’
-ఆంధ్ర, కర్నూలు మెడికల్ కాలేజీలకు అంతర్జాతీయ గౌరవం..
-పరిశోధక వైద్యులు చక్రవర్తి, విజయానంద్ కు మంత్రి
-సత్య కుమార్ అభినందనలు..
-ఇదే స్ఫూర్తిని మిగిలిన కళాశాలలు కూడా కొనసాగించాలని మంత్రి ఆకాంక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రపంచస్థాయి వైద్య పరిశోధనల్లో తమ ప్రతిభను చాటాయి. చిన్నారులకు ఇచ్చే పోలియో టీకాపై నిర్వహించిన కీలక అంతర్జాతీయ పరిశోధన ప్రపంచ ప్రఖ్యాత ది లాన్సెట్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ఈ ఏడాది మే 15న ప్రచురితమైంది. దేశంలోని తొమ్మిది ప్రముఖ వైద్య విద్యా సంస్థలు పాల్గొన్న ఈ బహుళ కేంద్రాల అధ్యయనంలో విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్–కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్), కర్నూలు మెడికల్ కాలేజ్ కీలక భాగస్వాములుగా నిలవడం రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన రంగాలకు మరో అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది.
643 మంది శిశువులపై అధ్యయనం
ఈ పరిశోధనను సుమారు రెండేళ్లపాటు ఫేజ్-2/3, డబుల్-బ్లైండ్, ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్‌గా నిర్వహించారు. తొలి దశలో 100 మంది శిశువులపై, అనంతరం మొత్తం 643 మంది శిశువులపై అధ్యయనం చేపట్టారు. విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్–కేజీహెచ్‌లో డా చక్రవర్తి గారి ఆధ్వర్యం లో వంద మందికి పైగా చిన్నారులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు..ఈ పరిశోధన లో కీలక భూమిక పోషించింది.కర్నూలు మెడికల్ కాలేజ్ కూడా ఈ పరిశోధన లో తన పాత్ర చక్కగా నిర్వహించింది.
తొమ్మిదిలో రెండు మన కళాశాలలే…
ఈ బహుళ కేంద్రాల పరిశోధనకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పుణె సమన్వయ సంస్థగా వ్యవహరించింది. ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (కొల్‌కతా), పీజీఐఎంఈఆర్ (చండీగఢ్), టోపీవాలా నేషనల్ మెడికల్ కాలేజ్–నాయర్ ఆసుపత్రి (ముంబయి), భారతి విద్యాపీఠ్ మెడికల్ కాలేజ్ (పుణె), మైసూరు మెడికల్ కాలేజ్, ఐఎంఎస్–సమ్ హాస్పిటల్ (భువనేశ్వర్)తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్‌లను అధ్యయన కేంద్రాలుగా ఎంపిక చేయడం విశేషం.
ప్రభుత్వ వైద్య కళాశాలలు దేశంలోని అత్యుత్తమ వైద్య సంస్థల సరసన నిలిచి ప్రపంచ స్థాయి పరిశోధనలో భాగస్వాములు కావడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది.
వ్యయo తగ్గే అవకాశం
ఈ అధ్యయనంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (IPV)తో పోలిస్తే కేవలం నాలుగో వంతు (¼) యాంటిజెన్ కలిగిన డోస్-స్పేరింగ్ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ds-IPV)ను పరీక్షించారు. తక్కువ యాంటిజెన్‌తో తయారైన ఈ టీకా కూడా పూర్తి మోతాదు టీకాతో సమానమైన రోగనిరోధక శక్తిని కలిగిస్తుందని, మూడు రకాల పోలియో వైరస్‌లపైనా సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. భద్రత పరంగానూ తీవ్రమైన దుష్ప్రభావాలు నమోదు కాలేదు. దీంతో తక్కువ మోతాదులోనే ఎక్కువ టీకా డోసులు తయారు చేయడం సాధ్యమై, ప్రపంచవ్యాప్తంగా టీకాల లభ్యత పెరగడంతో పాటు ప్రభుత్వాల వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు.
డా. చక్రవర్తి, డా విజయానoద్ ల కృషి
ఈ పరిశోధనలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ చిన్నారుల వైద్య విభాగాధిపతి డాక్టర్ బి.ఎస్. చక్రవర్తి, కర్నూలు మెడికల్ కాలేజ్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ విజయ ఆనంద్ అంతర్జాతీయ పరిశోధక బృందంలో సభ్యులుగా పనిచేశారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులు ప్రపంచస్థాయి క్లినికల్ పరిశోధనల్లో కీలక బాధ్యతలు నిర్వహించడం రాష్ట్ర పరిశోధనా సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.
కొద్దికాలం కిందట ఆంధ్ర మెడికల్ కాలేజ్ , పిల్లల వైద్య విభాధిపతి డా చక్రవర్తి ఆధ్వర్యం లో కలరా, టైఫాయిడ్, న్యుమోనియా టీకాలపై నిర్వహించిన అంతర్జాతీయ పరిశోధనలకు కూడా గుర్తింపు లభించింది.
పరిశోధనలకు ప్రాధాన్యం:మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య, వైద్య సేవలు, పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, క్లినికల్ పరిశోధనలకు అవసరమైన వాతావరణం, అధ్యాపకులకు ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పారు. “ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య జర్నళ్లలో ఒకటైన ‘ది లాన్సెట్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్’లో ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ భాగస్వామ్యంతో పరిశోధన ప్రచురితమవడం రాష్ట్ర వైద్య రంగానికి గర్వకారణమ”ని పేర్కొన్నారు. పరిశోధక వైద్యులు డాక్టర్ చక్రవర్తి డాక్టర్ విజయనoద్ ల బృందానికి అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News