-జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ నేడు తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఇటీవల దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంపై కొందరు చేసిన ఆరోపణల నేపథ్యంలో భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటి ఈ అంశాన్ని పరిశీలించింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అనుపమ అందించిన వివరాలు, సంబంధిత రికార్డులు మరియు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం, చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టమైందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ మాట్లాడుతూ… “దేవాలయాల ప్రతిష్ఠను దెబ్బతీసేలా, హిందూ ధర్మ విశిష్టతను కించపరిచేలా జరుగుతున్న అసత్య ప్రచారాలను భారతీయ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. వాస్తవాలను తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సమాజానికి, ధర్మానికి మేలు చేయవు. దేవాలయాలకు సంబంధించిన ఏ అంశమైనా బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి” అని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అయినంపూడి శ్రీకాంత్ మాట్లాడుతూ… “దేవాలయాల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ హిందూ పరిషత్ ప్రధాన లక్ష్యం. ఎక్కడైనా వాస్తవ సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి నిర్మాణాత్మకంగా కృషి చేస్తాం. అయితే నిరాధార ఆరోపణలతో దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ చేతుల మదుగా భారతీయ హిందూ పరిషత్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న “సూపర్-8 సిగ్నేచర్ సేవా కార్యక్రమాల” పోస్టర్లను ఆవిష్కరించారు. సమాజ సేవ, గోసంరక్షణ, విద్య, పర్యావరణ పరిరక్షణ, దేవాలయ సేవతో పాటు ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి మానేపల్లి మాతృశక్తి అధ్యక్షురాలు, రాష్ట్ర, జిల్లా మరియు స్థానిక కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News