-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-రాష్ట్రంలో విస్తృతంగా పరిశ్రమల ఏర్పాటు
-పారిశ్రామీకరణతో స్థానికంగానే ఉద్యోగాలు
-విద్యకు ప్రాధాన్యమిస్తున్న సీఎం చంద్రబాబు
-పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సంక్షేమ పథకాలు అమలు
-మెగా పీటీఎంతో విద్యార్థుల ప్రగతి మరింత పురోగతి : మంత్రి సవిత
-స్టేషన్ పేట ఎంజేపీలో ఘనంగా మెగా పీటీఎం
నర్సాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఉన్నత విద్య పూర్తికాగానే స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని, విద్యార్థుల డ్రాపౌట్ల నివారణే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని అన్నారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్(పీటీఎం)తో విద్యార్థుల పురోగతి మరింత మెరుగుపడుతుందన్నారు. నర్సాపూర్ నియోజక వర్గం స్టేషన్ పేటలో ఉన్న మహాత్మాజ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ తో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో విద్యాభివృద్దికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అన్న ఎన్టీఆర్ గురుకుల విద్యను ప్రారంభిస్తే, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో అత్యధిక గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. 2014-19 మధ్య సీఎం చంద్రబాబునాయుడు 75 బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 12 ఎంజేపీ గురుకులాలను స్థాపించారన్నారు. బీసీ బిడ్డలు ఉన్నత విద్యలు చదవాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది విద్యా సంవత్సరంలో కొత్తగా పది బీసీ గురుకులాలను ప్రారంభించారన్నారు. ఆరు బాలిక బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేశారన్నారు. బీసీ గురుకులాల్లో చదవే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన, పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. బీసీ గురుకులాలు, హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా, డ్రాపౌట్ల నివారణకు పలు సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారన్నారు. తల్లికి వందనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.
నివాసం ఉన్న చోటే ఉద్యోగాలు
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. పరిశ్రమల రాకతో ఉన్నత ఉద్యోగాలు పూర్తి కాగానే యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. ఈ రెండూ అందుబాటులోకి వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరంగా దూసుకుపోవడం తథ్యమని మంత్రి సవిత ధీమా వ్యక్తంచేశారు. మెగా పీటీఎం నిర్వహణతో విద్యార్థుల ప్రగతితో పాటు వారి మానసిక, శారీరక స్థితిగతులపైనా తల్లిదండ్రులకు మరింత అవగాహన కలుగుతుందన్నారు. ఈ ఏడాది మే నెలలో విడుదలైన టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఎంజేపీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. మెగా పీటీఎం నిర్వహణతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అవగాహన పెరిగి, విద్యార్థుల అభివృద్ధికి మరింత దోహదపడతారన్నారు. అనంతరం మంత్రి సవిత… విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత సహా పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News