-రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పట్టన్ శెట్టి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమ టమాటా మార్కెట్లలో డిమాండ్ కు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులు నమోదయ్యాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పట్టన్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాయలసీమ ప్రాంతంలోని పలమనేరు, వి.కోట, పుంగనూరు, మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, కలికిరి, పట్టికొండ, రాప్తాడు (ప్రైవేట్ మార్కెట్), పీపుల్లి (ప్రైవేట్ మార్కెట్) మార్కెట్ యార్డులకు మొత్తం 5,564.91 మెట్రిక్ టన్నుల మొదటి రకం,6,650.17 మెట్రిక్ టన్నుల రెండవ రకం టమాటాలు చేరగా మొత్తం రాకలు 12,215.08 మెట్రిక్ టన్నులు నమోదయ్యాయని తెలిపారు.
పలమనేరు, వి.కోట, పుంగనూరు, మదనపల్లె మార్కెట్ యార్డుల్లో నాణ్యమైన టమాటా రాకతో ధరలు నిలకడగా నమోదయ్యాయని, కలికిరి మార్కెట్‌లో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరగడం వల్ల గత వారం కంటే మెరుగైన ధరలు లభించినప్పటికీ, నిన్నటితో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించిందన్నారు. ములకలచెరువు మార్కెట్‌లో గరిష్ట మార్కెటింగ్ సీజన్ కొనసాగుతుండటంతో రాకలు అధికంగా నమోదయ్యాయని, డిమాండ్-సరఫరా పరిస్థితులను బట్టి ధరలు నిర్ణయించబడుతున్నాయని వివరించారు.
రాప్తాడు ప్రైవేట్ మార్కెట్కు అత్యధికంగా 6,750 మెట్రిక్ టన్నుల టమాటా రాక నమోదైందని తెలిపారు. అధిక ఉత్పత్తి, స్థానిక మార్కెట్లకు భారీగా వస్తున్న సరుకు, అలాగే కర్ణాటక, చిత్తూరు, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల నుంచి సరఫరా పెరగడం వల్ల మార్కెట్లో లభ్యత అధికమై ధరలు కొంత తగ్గినట్లు పేర్కొన్నారు. పట్టికొండ మరియు పీపుల్లి మార్కెట్లలో టమాటా రాకలు నమోదు కాలేదని తెలిపారు.
సీజన్ ముగింపు దశలో ఆకస్మిక వాతావరణ మార్పులు, సాగుకు అనుకూలం కాని పరిస్థితుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో టమాటాపై నల్ల మచ్చలు ఏర్పడి నాణ్యత దెబ్బతిన్నట్లు తెలిపారు. ఫెయిర్ క్వాలిటీ, దెబ్బతిన్న టమాటాకు వ్యాపారులు అధిక ధరలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని, అయితే మంచి నాణ్యత కలిగిన టమాటాకు మాత్రం మార్కెట్లో డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించారు.
రైతులు టమాటాను నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు తీసుకువస్తే మెరుగైన ధరలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు రోజువారీ ధరలు, రాకలు, మార్కెట్ ధోరణులపై తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News