Breaking News

స్వచ్ఛతకు ప్రతి అడుగు.. ఆరోగ్యాంధ్ర‌కు ముందడుగు

– స‌మ‌ష్టి భాగ‌స్వామ్య‌మే స్వచ్ఛాంధ్రకు బలమైన పునాది
– ప్ర‌తిఒక్క‌రూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలి
– ప‌రిశుభ్ర‌మైన ప‌రిస‌రాల‌తోనే మ‌న ఆరోగ్య‌క‌ర‌మైన భ‌విష్య‌త్తు
– స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గ్రామగ్రామాన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా నిర్వహిస్తున్నామని.. ఇవి మంచి ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని, మ‌నం స్వ‌చ్ఛ‌త‌వైపు వేసే ప్ర‌తి అడుగు ఆరోగ్యాంధ్ర‌కు ముంద‌డుగు అని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
శ‌నివారం జి.కొండూరులోని క‌మ్యూనిటీ హాల్ వ‌ద్ద జిల్లా పంచాయ‌తీ కార్యాల‌యం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పాల్గొన్నారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ‌, వైద్య ఆరోగ్య‌శాఖ‌, పంచాయ‌తీరాజ్ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్ల‌ను ప‌రిశీలించారు. భార‌త సుప్రీంకోర్టు ఆదేశాలు-ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ మ‌న బాధ్య‌త‌, మ‌న క‌ర్త‌వ్యం అనే అంశంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్ర‌మే కాదని, ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి ఆచరణలో పెట్టినప్పుడే శాశ్వతమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు. మ‌న నుంచి, మ‌న కుటుంబం నుంచి, మ‌న గ్రామం నుంచి స్వచ్ఛతకు సంబంధించిన మంచి అలవాట్లు కొన‌సాగాల‌ని పేర్కొన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా ఉంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమి, నీరు, వాయు కాలుష్యానికి కారణమవుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా ఉండ‌టం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. ప‌రిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన జీవనానికి పునాది అని.. మనం ఈరోజు తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలే రేపటి తరాలకు ఆరోగ్యకరమైన, పర్యావరణహిత భవిష్యత్తును అందిస్తాయ‌ని పేర్కొన్నారు. చెత్త నుంచి సంప‌ద సృష్టి కేంద్రాలు కూడా విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని.. మార్పు కోసం ఎదురు చూడకుండా.. మార్పును మన నుంచే ప్రారంభిద్దామ‌ని, మన ఇల్లు స్వచ్ఛంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.. మన గ్రామం స్వచ్ఛంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.. మన జిల్లా స్వచ్ఛంగా ఉంటే ఆరోగ్య ఆంధ్ర లక్ష్యం నెర‌వేరుతుంద‌ని పేర్కొన్నారు. స్వచ్ఛతే దైవత్వానికి ప్రతిరూప‌మ‌న్న మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్య‌మివ్వాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో భాగంగా నేను.. నా ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త కోసం ప్ర‌తిరోజూ కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తాన‌ని.. నా తోటివారికి కూడా స్వ‌చ్ఛ‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించే దిశ‌గా ప్ర‌య‌త్నిస్తాన‌ని.. నా రాష్ట్రాన్ని స్వ‌ర్ణాంధ్ర‌-స్వచ్ఛాంధ్ర‌గా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషిచేస్తానంటూ క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప్ర‌తిజ్ఞ చేయించారు. గ్రామంలోని గ్రీన్ అంబాసిడ‌ర్ల సేవ‌ల‌ను గుర్తుచేసుకుంటూ వారిని స‌త్క‌రించారు. అదేవిధంగా త‌డిచెత్త‌, పొడిచెత్తను వేరుచేసి ఇస్తూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న మ‌హిళ‌ల‌ను కూడా స‌త్కరించారు. కార్య‌క్ర‌మంలో డీపీవో టి.సీతామ‌హాల‌క్ష్మి, జి.కొండూరు మండల పరిషత్ అధ్యక్షులు వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, జి.కొండూరు ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, జి.కొండూరు తహసిల్దార్ డి.రిబ్కా రాణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *