గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, పురపాలక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరగాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు మాత్రమే ప్రతి అంశాన్ని అమలు చేయాలని అన్నారు. ఇప్పటికే వివిధ స్థానాల రిజర్వేషన్ ప్రక్రియను ప్రకటించడం జరిగిందని వాటిని తూచా తప్పక పాటించాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతి అంశాన్ని అతి జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News