Breaking News

సీజన్ ఏదైనా… నిర్విరామంగా 24x 7 విద్యుత్ సరఫరా…

-రోజుకు 500 నుంచి 1500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రంగం సిద్ధం
-టెండర్లు ధాఖలు చేసిన ఏపీ డిస్కాములు
-బొగ్గు కొరత నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు షురూ
-జులై, అక్టోబర్ మధ్య కాలంలో 6 శాతం పెరగనున్న విద్యుత్ డిమాండ్
-జూన్ 28న ముగియనున్నవిద్యుత్ కొనుగోలు టెండర్ ప్రక్రియ
-అలాగే 31 లక్షల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోనున్న విద్యుత్ సంస్థలు
-బొగ్గు కొరత కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం – ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-24×7 విద్యుత్ సరఫరా పై రాజీ లేదు — ఇంధన శాఖ మంత్రి
-రాష్ట్రంలో ప్రతి ఇంటికి నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యం
-ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 24 x 7 సరఫరాను బలోపేతం చేస్తాం
-వ్యవసాయ విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి
-బొగ్గు సరఫరా మెరుగుపరిచేందుకు కేంద్ర విద్యుత్ , రైల్వే శాఖలతో నిరంతర సంప్రదింపులు– ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , కె విజయానంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో నెలకొన్న బొగ్గు కొరతను దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో 24x 7 విద్యుత్ సరఫరా , వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు ముందస్తు చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా జులై నుండి అక్టోబర్ నెలల మధ్య రోజుకు 500 మెగావాట్ల నుండి 1500 మెగావాట్ల మధ్య విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు టెండర్లు ధాఖలు చేసాయి.రానున్న నెలల్లో దేశంలో మరోసారి పెద్ద ఎత్తున బొగ్గు కొరత , విద్యుత్ కొరత రావచ్చునని హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. దీనివల్ల విద్యుత్ కొరతను అధిగమించడమేగాక, వర్షాకాలంలో ఏర్పడే అదనపు డిమాండ్ ను కూడా అందుకునే అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలో విద్యుత్ సరఫరా పరిస్థితి పై ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్ర రెడ్డి గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బొగ్గు కొరత, ఇతర అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో 24x 7 విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యల పై చర్చించారు.
వర్షాకాలంలో పెరగనున్న విద్యుత్ డిమాండ్ ను అందుకునే స్థితిలో ఆయా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లు లేవని తెలిపారు. దేశ వ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత దీనికి కారణమని అధికారులు వివరించారు. వర్షాకాలం వల్ల బొగ్గు తవ్వకం , రవాణాకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని దానివల్ల బొగ్గు నిల్వలు పెంచుకునే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చునని వారు వివరించారు.

అంతేగాక దేశంలో గత ఏడాది 1500 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వగలిగే అవకాశం ఉన్నప్పటికీ , కేవలం 777 మిలియన్ టన్నులు మాత్రమే తవ్వటం జరిగింది. అనగా బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం లో సగం మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ కారణాల వల్ల ఈ ఏడాది కూడా థర్మల్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు ఉంచడం కష్టతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అంతిమంగా రానున్న నెలల్లో మరోసారి బొగ్గు కొరతకు దారితీసే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో జులై , అక్టోబర్ నెలల మధ్యకాలంలో గత ఏడాదితో పోలిస్తే 6 శాతం విద్యుత్ డిమాండ్ పెరగనుందని అంచనా వేస్తున్నారు.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రాష్ట్రంలో నెలవారీ విద్యుత్ డిమాండ్ వరుసగా 5684 ఎం యు, 6517 ఎం యు, 6071 ఎం యు, 6224 ఎం యు గా ఉండవచ్చని అంచనా. ఈ దృష్ట్యా జులై , అక్టోబర్ నెలల మధ్య కాలంలో రోజుకి 500 నుచి 1500 మెగా వాట్ల మధ్య విద్యుత్ ను కొనుగోలు చేయాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి.దీన్ని దృష్టిలో ఉంచుకుని, జూలై నుండి అక్టోబర్ వరకు ఉదయం గరిష్టంగా (05:00 నుండి 8:00 గంటలు), సాయంత్రం గరిష్టంగా (18:00 నుండి 24:00 వరకు)మరియు రౌండ్ ది క్లాక్ (RTC)(00:00 నుండి 24:00 గంటలు) రోజువారీ 500 MW నుండి 1500 MW వరకు విద్యుత్ కొనుగోలు చేయాలని విద్యుత్తు సంస్థలు నిర్ణయించాయి. తద్వారా 24x 7 విద్యుత్ సరఫరాకు ఢోకా లేకుండా చూడాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. విద్యుత్ కొనుగోలు నిమిత్తం షార్ట్ టర్మ్ టెండర్లను దాఖలు చేసాయి. ఈ నెల 28 తో టెండర్ ప్రక్రియ పూర్తికానుంది. అలాగే 31 లక్షల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని కూడా నిర్ణయించారు.
రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి , ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న నెలల్లో విద్యుత్ కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీసుకున్న ముందస్తు చర్యలను అభినందించారు. .“సీజన్ ఏదైనా … 365 రోజులు నిర్విరామంగా వినియోగదారులకు 24x 7 విద్యుత్ సరఫరా చేయటం ప్రభుత్వం అంతిమ ధ్యేయం” అని మంత్రి అన్నారు
బొగ్గు కొరత కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని. , వినియోగదారులకు 24×7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతోపాటు వ్యవసాయ రంగానికి 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గత ఏడాది నుంచి దేశంలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 24x 7 విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడడంలో విజయవంతం అయిందని మంత్రి పేర్కొన్నారు.
” మాది ప్రజా ప్రభుత్వం. విద్యుత్ రంగంలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. దీర్ఘ కాలంలో 24x 7 విద్యుత్ సరఫరాను విజయవంతంగా అమలు చేయటమే మా లక్ష్యం. ప్రజల సంక్షేమం , రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ రంగాన్ని మరింతగా బలోపేతం చేస్తున్నాం రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఇంటికి కూడా నాణ్యమైన, నమ్మకమైన 24x 7 విద్యుత్ సరఫరా అందించడమే ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం”అని ఇంధన శాఖ మంత్రి తెలిపారు.
ఈ ఏడాది వేసవిలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు అధికంగా ఉన్నప్పటికీ విద్యుత్ కనుగోలుకు ప్రభుత్వం వెనకాడట్లేదని తెలిపారు . అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న నెలల్లో కూడా 24x 7 విద్యుత్ సరఫరాకు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా , దీని పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
రాష్ట్రానికి బొగ్గు సరఫరాను పెంచుకునేందుకు కేంద్ర బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలతో ఎప్పటికపుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, సి ఎం డీ , ఏ పీ ట్రాన్స్కో , బీ శ్రీధర్ తో కలిసి మంత్రికి వివరించారు . రానున్న రోజుల్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్ , బొగ్గు కొరతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అవాంతరాలు అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిస్కాములను కోరారు. క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సిబ్బంది ని అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు .
ప్రతిపాదిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పవర్ నెట్వర్క్ పటిష్టత తదితర కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఏపీ విద్యుత్తు సంస్థలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయని, వీటి కోసం ఇంధన శాఖ ఎప్పటికప్పుడు నిర్మాణ కార్యకలాపాలను సమీక్షించి ఏదైనా అడ్డంకులు ఎదురైతే నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటోందని విజయానంద్ చెప్పారు.
రోజువారీ డిమాండ్ గురించి అధికారులు వివరిస్తూ, జూన్ 22 న డిమాండ్ 188.04 మిలియన్ యూనిట్లు(ఎం . యు ) ఉండగా, అందులో జెన్కో నుంచి 58.97 ఎం యు , సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 24. 79 ఎం యు , ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 12.92 ఎం యు , సోలార్ 18 ఎం యు , పవన విద్యుత్ 40. ఎం యు , మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు 27. 11 ఎం యు , హైడెల్ 6 మిలియన్ యూనిట్లుగా నమోదైంది .
జేఎండీ హెచ్ఆర్డీ అడ్మిన్ ఏ పీ ట్రాన్స్కో , ఐ పృధ్వి తేజ్, డిస్కమ్ల సీఎండీలు హెచ్ హరనాథరావు, జే పద్మా జనార్దనరెడ్డి, కే సంతోషరావు పాల్గొన్న ఈ సమీక్ష లో డైరెక్టర్ గ్రిడ్ ఏ పీ ట్రాన్స్కో , ఏవీకే భాస్కర్ నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు చేపట్టిన పలు కార్యక్రమాల గురించి సవివరంగా వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *