– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-26 వ డివిజన్ 30 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26 వ డివిజన్ 30 వ వార్డు సచివాలయ పరిధిలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామతో కలిసి ఆయన పాల్గొన్నారు. మారుతీనగర్లోని పాత మలేరియా ఆఫీస్ రోడ్డు, హిందూ కాలేజీ రోడ్డులలో విస్తృతంగా పర్యటించి.. 270 గడపలను సందర్శించారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ప్రజలను ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ.. చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు., అధికారుల పనితీరు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందని మల్లాది విష్ణు అన్నారు. ప్రతి ఇంటినీ జల్లెడపట్టి 21 డివిజన్లలోనూ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. ఇందిరానాయక్ నగర్లో తొలిరోజు నిర్వహించిన క్యాంపు ద్వారా 1,358 మందికి 2,562 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందుల కిట్లను అందజేసినట్లు చెప్పారు. అలాగే 170 మంది వైఎస్సార్ కంటివెలుగు ద్వారా కళ్ల పరీక్షలు నిర్వహించగా.. వారందరికీ కళ్లజోళ్లను అందిస్తామన్నారు. మరోవైపు నార్త్ మండల పరిధిలోని నిషేధిత భూముల జాబితా సెక్షన్ 22(ఏ) లో ఉన్న భూముల తొలగింపునకు జిల్లా రిజిస్ట్రార్ కు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. కనుక కండ్రిక, శాంతినగర్, రాధానగర్, ప్రకాష్ నగర్, ప్రజాశక్తి నగర్, ఏవీఎస్ రెడ్డి రోడ్డు, రాజీవ్ నగర్, వడ్డెర కాలనీ, సుందరయ్య నగర్, ఎల్బీఎస్ నగర్, పటేల్ నగర్, వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, బర్మా కాలనీ, అజిత్ సింగ్ నగర్ ప్రజలు నున్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సంప్రదించి.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసుకోవలసిందిగా సూచించారు.
జగనన్నే మళ్లీ కావాలి
ఈనెల 9 నుంచి ‘ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి’ అనే నినాదంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటా క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లి.. అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఇందులో భాగంగా పార్టీ యంత్రాంగమంతా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి.. ప్రజలతో మమేకమవుతారని వెల్లడించారు. ప్రభుత్వ సేవలను చెబుతూ.. జగనన్న నాయకత్వం ఎందుకు అవసరమో వివరిస్తారన్నారు. కానీ ఒక ఆశయం, సిద్ధాంతం, మేనిఫెస్టో కూడా లేని ప్రతిపక్షాలను ఏపీలోనే చూస్తున్నామని మల్లాది విష్ణు విమర్శించారు. ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రిని దుమ్మెత్తి పోయడం తప్ప.. కనీనం నియోజకవర్గాల ఎల్లలు కూడా వారికి తెలియదని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ(వాటర్ & యూజీడీ) రామకృష్ణ, సీడీఓ జగదీశ్వరి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లుట్ల వంశీ, నాయకులు కోలా నాగాంజనేయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.