-సంగీత వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్ వి చెన్నారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వాయిద్య కళాకారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంగీత వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్ వి చెన్నారావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నారావు ఆంధ్రప్రదేశ్ సంగీత వాయిద్య కళాకారుల సంఘం నూతన అధ్యక్షురాలిగా ఎస్ మీరాభీ, ఉపాధ్యక్షులు వి కృష్ణారావు, కార్యదర్శి కె శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఓ సునీత, కోశాధికారి ఎం నారాయణ, కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. సంగీత కళాకారుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సంఘం నూతన అధ్యక్షురాలు మీరా భీ మాట్లాడుతూ వాయిద్య కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతి జిల్లాలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గతంలో ఇచ్చిన విధంగా వాయిద్య పరికరాలను ఉచితంగా ఇవ్వాలని కోరారు. సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 51 డివిజన్ మాజీ కార్పొరేటర్ సుకాసి సరిత టిడిపి మహిళా ఉపాధ్యక్షురాలు ఆషా, టిడిపి మహిళలు, వాయిద్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు.