-జగనన్న కాలనీల సందర్శనలో మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ.. వారికి నిలువ నీడ లేకుండా చేస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. నున్న, సూరంపల్లిలోని జగనన్న లేఅవుట్ లను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. త్రాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గృహ యజమానులు మల్లాది విష్ణు వద్ద వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. బస్సు సౌకర్యం సహా అన్ని మౌలిక సదుపాయాలు సమాకూరి ఉండేవని మల్లాది విష్ణు చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం రావటం లబ్ధిదారుల పాలిట శాపంగా మారిందన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అయితే.. ఆ ఇళ్లను పాడుబెడుతున్న ఘనత కూటమి ప్రభుత్వానిది అని మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కల సాకారం కోసం గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31.70 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి లక్షా 80 వేల సాయం అందించినట్లు చెప్పారు. ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 23,490 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించగా.. తొలిదశలో 14,986 ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నున్న లేఅవుట్ లో తొలి దశలో 4,048 ఇళ్ల నిర్మాణాలకుగాను 1,078 ఇళ్లు పూర్తి చేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. సూరంపల్లిలో 3,930 ఇళ్లకుగానూ 819 గృహాలతో పాటు 107 మంది సొంతగా ఇళ్లు నిర్మించుకున్నట్లు వివరించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఇళ్లన్నింటినీ పాడుబెడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇస్తామని కేబినెట్ మీటింగ్ లో ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అలాగే అమరావతిలో పేదలెవరు ఉండకూడదనే రీతిలో ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. గత ప్రభుత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 8,504 మంది పేద కుటుంబాలకు అమరావతిలో స్థలాలు కేటాయించడమే కాకుండా నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా నిర్మాణాలను నిలిపివేసిందని నిప్పులు చెరిగారు. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, మరోవైపు ఉంటున్న ఇంటికి అద్దె భారంతో లబ్ధిదారులు ఆర్థిక వెతలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. అలాగే లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుద్దీకరణ పనులు త్వరితగతిన పూర్తిచేసి.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు తెలియపరచాలని కోరారు. లేనిపక్షంలో పేదల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, యరగొర్ల శ్రీరాములు, మేడా రమేష్, జగదీష్, పఠాన్, నాగూర్, సయ్యద్ ముస్తఫా, షేక్ షేర్ అలీ, తదితరులు ఉన్నారు.