-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక వన సమారాధనలు సమైక్యతకు, స్నేహాభిమానాలు పెంచుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కొత్తూరు తాడేపల్లిలోని రాజుగారి మామిడితోటలో బ్రాహ్మణ కార్తీక వనసమారాధన ఆదివారం సందడిగా జరిగింది. బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయంలో వన విహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. యాంత్రిక జీవనంలో కార్తీకమాసం కొత్త శోభను తీసుకువస్తుందని.. ఆత్మీయులందరూ ఒకచోట చేరడం వల్ల బంధాలు, బాంధవ్యాలు బలపడతాయన్నారు. గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమంగా బంధుమిత్రుల సమక్షంలో కార్తీక వన భోజనాలు జరిగేవని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆ వేదికలను సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఉపయోగించుకుంటున్నారన్నారు. ఇలా అందరూ ఒక వేదికగా కలుసుకుని కష్ట సుఖాలు చర్చించుకుంటూ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు.
బ్రాహ్మణులంటే సీఎం జగన్ కు అపార గౌరవం
బ్రాహ్మణులంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అపార గౌరవమని మల్లాది విష్ణు అన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఈ ప్రభుత్వంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార పరిషత్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేద అర్చకుల ప్రతి ఒక్క న్యాయబద్ధమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తోందని చెప్పారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు తెచ్చిన జీవోను సవరించి అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేద అర్చకులకు రూ. 5 వేలు చొప్పున ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. అలాగే ఈ ప్రభుత్వంలో దేవాలయాలన్నీ ధూపదీప నైవేద్యాలతో, నిత్య కైంకర్యాలతో కళకళలాడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న తోడ్పాటుతో బ్రాహ్మణ సోదరులు ప్రగతిపథంలో ముందుకు దూసుకువెళుతున్నారని.. స్వతంత్ర భారతంలో ఎన్నడూ సాధించనంత అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని తెలియజేశారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో 33వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, కొప్పరపు బలరామకృష్ణ మూర్తి, నిడుమోలు రామా సత్యనారాయణ, దమ్మాలపాటి చంద్రశేఖర్, బ్రాహ్మణ సోదర సోదరీమణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News