-ఎం.డి. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“2023 సంవత్సరంలో మీ అందరి సమిష్టి కృషి ఫలితంగా సంస్థలో ఉత్తమ గణాంకాలు నమోదయ్యాయి, అదే స్పూర్తిగా తీసుకుని ఈ కొత్త సంవత్సరం కూడా మనందరం అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికీ, సంస్థకూ మంచి పేరు తీసుకు వద్దాం” అని సంస్థ ఎం.డి. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. అన్నారు.
ఈ రోజు ఆర్టీసీ హౌస్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి, ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సంవత్సరం కూడా ఎం.డి. గా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని , ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ ఎం.డి. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. తెలిపారు. 2023 సంవత్సరంలో గ్యారేజీ సిబ్బంది మొదలు ఆఫీసర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో సమిష్టి కృషితో పని చేశారని, అందువల్లే మెరుగైన ఫలితాలు సాధించగలిగామని అదేవిధంగా, ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇదే స్పూర్తితో పనిచేస్తే సంస్థ మరింతగా వృద్ధి సాధిస్తుందని తెలిపారు. త్వరలో కొత్త డిజైన్లతో, కొత్త కొత్త రంగులతో 1500 కొత్త డీజిల్ బస్సులు, అలాగే 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా బస్సుల నిర్వహణ ఉండాలన్నారు. మంచి బస్సులతో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బస్ స్టేషన్లు, డిపోలు కూడా ఆధునీకరించుకోవలసిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుతున్నట్లు వివరించారు. ప్రయాణికులపైన మనం ఆధారపడి ఉన్నామని ఓ. ఆర్. పెంచుకోవడం వలన సంస్థ టిక్కెట్ రెవెన్యూ పరంగా మంచి ఆదాయాన్ని సాధించగలమని తెలిపారు. గత సంవత్సరం, ఏ ఇతర ఆర్టీసీలలో లేని విధంగా ముందుగా హయ్యర్ పెన్షన్ మన ఉద్యోగులకే లభించిందని తెలిపారు. చివరగా ఈ నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నామని, ఇదే ఉత్సాహంతో సంస్థ అభివృద్ధికి, ప్రతి ఒక్క ఉద్యోగి తమతమ గురుతర బాధ్యతలు నిర్వర్తించాలని, ఈ కొత్త సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలనే ఆశాభావం వ్యక్తం చేశారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓ) ఏ. కోటేశ్వరరావు,సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇ) కృష్ణ మోహన్,ఎఫ్. ఏ. & సి. ఏ. ఓ. రాఘవ రెడ్డి, ఓ.ఎస్.డి. (కార్గో & లాజిస్టిక్స్) రవి వర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ (వి&ఎస్.) శోభా మంజరి, ఆర్టీసీ హౌస్ అధికారులు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఉద్యోగులు, విజయవాడ పి.ఎన్.బి.ఎస్. సిబ్బందితదితరులుపాల్గొన్నారు.
Prajavartha Online Telugu News