Breaking News

తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాలి

-భాషలో సంస్కృతి అంతర్భాగం
-భారత పూర్వ ఉపరాష్ర్టపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
-మేడారం జాతరపై ‘ఆత్మగౌరవ ప్రతీక’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సాహిత్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన బండి ఉష  సంపాదకత్వంలో మేడారం జాతరపై వెలువరించిన ‘ఆత్మగౌరవ ప్రతీక’ సంకలనాన్ని వెంకయ్యనాయుడు బుధవారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల, తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ మేడారం జాతర అని చెప్పారు.ప్రకృతి కోసం, ప్రకృతిని నమ్ముకున్న సామాన్య ప్రజల కోసం ప్రకృతి శక్తులుగా మారి బలాఢ్యులపై వీరోచిత పోరు సాగించి పరాశక్తులుగా కోట్ల మంది ప్రజల పూజలందుకుంటున్న సమ్మక్క – సారలమ్మ లకు అక్షరాంజలి ఘటిస్తూ 535 మంది రచయితలు, రచయిత్రులు.. కవితలు, పద్యాలతో ఒక చక్కని సంకలనాన్ని వెలువరించటం సంతోషకరం అన్నారు. ఈ పద్యాలు, కవితలు సమ్మక్క -సారలమ్మ ల చరిత్రను, మేడారం జాతర ప్రాముఖ్యతను వివరంగా ఆవిష్కరించాయని అభినందించారు. ‘‘ప్రకృతిని ప్రేమించు ప్రకృతితో జీవించు అన్న భారతీయ సనాతన ధర్మ సందేశాన్ని మనకు సమ్మక్క -సారలమ్మ చరిత్ర తెలియజేస్తుంది. అటువంటి గొప్ప చరిత్ర ఈ తరానికి కూడా చక్కగా అర్థమయ్యేలా ఈ సంకలనం ఉంది.’’ అని చెప్పారు. ఈ సంకలనంలో పాలుపంచుకున్న రచయితలు, రచయిత్రులు అభినందనీయులన్నారు.
బుధవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అన్న సంగతిని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ సంస్కృతిని తేట తెలుగులో, అత్యంత సరళంగా పద్యాలు, కవితల రూపంలో తీసుకురావడం మంచి విషయమన్నారు. ‘‘భాష అంటే పరస్పరం మాట్లాడుకునే ఒక సాధనం మాత్రమే కాదు. భాషలో సంస్కృతి అంతర్లీనంగా పెనవేసుకుపోయి ఉంటుంది. ఒక ప్రాంతము, ఒక సమూహము సముపార్జించిన జ్ఞాన సంపద, విలువలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను తరతరాలుగా మోసుకొస్తూ ఎప్పటికప్పుడు ముందు తరాలకు అందించే ఒక సజీవ ప్రవాహం. అందుకే భాష పోతే శ్వాస పోయినట్లే, భాష పోతే ఒక జాతి ఉనికిపోయినట్లే. మన మాతృభాషే మన ఉనికి. మన చక్కనైన, చిక్కనైన తెలుగు భాషను పరిరక్షించుకుందాం. తెలుగు భాష కోసం కృషి చేసే వారిని, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు రచయితలు, రచయిత్రులను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో తెలుగే మాట్లాడాలని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రతినపూనుదాం.’’ అని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *