Breaking News

వెంకయ్యనాయుడి నుంచి చాలా నేర్చుకున్నా – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

-యువత రాజకీయాల్లోకి రావాలి, సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి – ముప్పవరపు వెంకయ్యనాయుడు
-వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య 
– దేశ ప్రయోజనాలే మిన్న అని నమ్మిన వ్యక్తి
-ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని
-భారత పూర్వ ఉపరాష్ర్టపతి 75వ పుట్టినరోజు సందర్భంగా, వారి జీవిత విశేషాలతో మూడు పుస్తకాల ఆవిష్కరణ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నుంచి తాను చాలా నేర్చుకున్నానని భారత ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ చెప్పారు. మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య నాయుడి జీవితమన్నారు. వెంకయ్యనాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న అన్వయ కన్వెన్షన్ లో “పంచ సప్తతి” పేరిట వారి మిత్రులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ వేదిక ద్వారా ప్రధానమంత్రి … వెంకయ్య నాయుడి జీవన ప్రస్థానం ఆధారంగా రూపు దిద్దుకున్న 1. వెంకయ్య నాయుడు (ఐ లైఫ్ ఇన్ సర్వీస్) – జీవన ప్రస్థానం – ఆంగ్లం, 2. సెలబ్రేటింగ్ భారత్ (13వ ఉపరాష్ట్రపతిగా 5 ఏళ్ళ ప్రయాణం) – ఆంగ్లం, 3. మహానేత (జీవన చిత్రమాలిక) – తెలుగు పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ వెంకయ్యనాయుడితో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి సుదీర్ఘకాలం పాటు పని చేసే అవకాశం దక్కిందన్నారు. ఆయన భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన కాలంలో, తన మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా పని చేసినప్పుడు, ఉపరాష్ర్టపతిగా, రాజ్యసభ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించినప్పడు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందన్నారు. ‘‘ఒక చిన్నగ్రామం నుంచి ప్రస్థానం మొదలు పెట్టి, పెద్ద పెద్ద పదవులు చేపట్టిన వెంకయ్యనాయుడి అనుభవ సంపద అమూల్యం. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య నాయుడి జీవితం.’’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో కొన్ని దశాబ్దాల క్రితం భారతీయజనతాపార్టీ, జనసంఘ్ కు పెద్దగా పునాది లేదన్న సంగతిని మోదీ గుర్తు చేస్తూ అటువంటి రోజుల్లోనే వెంకయ్యనాయుడు దేశ ప్రయోజనాలే అన్నింటికన్నా ముందు అని విశ్వసించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏబీవీపీ కార్యకర్తగా ఎంతో కష్టపడి, తదనంతరం పార్టీని నమ్ముకుని పని చేశారని కొనియాడారు.

అత్యయిక స్థితి కి వ్యతిరేకంగా వెంకయ్యనాయుడు పోరాడారని గుర్తు చేసిన నరేంద్ర మోదీ, 17 నెలల పాటు జైల్లో నిర్బంధించినా ఆయన వెనకంజ వేయకుండా ధైర్యంగా పోరాడారని కొనియాడారు. వెంకయ్యనాయుడు రాజకీయాలను, అధికారాన్ని సేవా మార్గంగా భావించారన్న ఆయన, వాజ్పేయి ప్రభుత్వంలో శ్రీ వెంకయ్యనాయుడిగారికి మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏరికోరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారని చెప్పారు. ‘‘వెంకయ్యనాయుడు గారు గ్రామాలకు, పేదలకు, రైతులకు సేవ చేయాలనుకున్నారు.’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత తన హయాంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్వచ్ఛభారత్ మిషన్, స్మార్ట్ నగరాల వంటి కార్యక్రమాలను ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్లారన్నారు.
ముప్పవరపు వెంకయ్యనాయుడు సౌమ్యత, చమత్కారంతో కూడిన వాక్చాతుర్యాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి వారి తెలివితేటలు, సహజత్వం, త్వరితగతిన ప్రతిస్పందించటం, వన్ లైనర్లకు ఎవరూ సాటి లేరని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అటల్ జీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో “ఒక చేతిలో బీజేపీ జెండా – మరో చేతిలో ఎన్డీయే అజెండా” అంటూ వారు ఇచ్చిన నినాదాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా 2014లో మోదీ (MODI) అనే అక్షరాలకు మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అనే సంక్షిప పదాన్ని ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లోని లోతు, గాంభీర్యం, దార్శనికత, వివేకం వంటివి తనకు అనేక సందర్భాల్లో ఆశ్చర్యపరిచాయని గుర్తు చేశారు.
వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు సభలో ఉన్న సానుకూల వాతావరణాన్ని గుర్తు చేసిన ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఆ సమయంలో సభలో జరిగిన సానుకూల చర్చల గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ 370 బిల్లును ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, సభా ఔన్నత్యం, మర్యాదలను కొనసాగిస్తూనే ఇలాంటి ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందటంలో వారి అనుభవజ్ఞత ఎంతగానో ఉపయోగపడిందని ప్రశంసిచారు.  వెంకయ్యనాయుడు పరిపూర్ణమైన జీవితాన్ని, సంపూర్ణ ఆరోగ్యంతో గడపాలని ప్రధాని ఆకాంక్షించారు.
భావోద్వేగాలు, ప్రతికూలతలు వంటి అంశాలు వెంకయ్యనాయుడు నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేయలేకపోయాయన్న ప్రధానమంత్రి, సంక్రాంతి వంటి తెలుగు పండుగల సందర్భంలో ఢిల్లీలో వెంకయ్య నివాసంలో జరిగిన సంబరాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశ రాజకీయాల్లో వెంకయ్య నాయుడు సేవలను ప్రశంసించిన ఆయన, ఈరోజు ఆవిష్కరించిన మూడు పుస్తకాలు యువతకు స్ఫూర్తిదాయకమైనవి అని పేర్కొన్నారు. 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం స్వాతంత్ర శతాబ్ధి ఉత్సవాలను జరుపుకోనుందని, అదే సమయంలో వెంకయ్యనాయుడు కూడా తమ జీవన శతాబ్ధి మైలురాయిని జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి సందేశానికి ధన్యవాదాలు చెప్పిన పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు,  నరేంద్రమోదీ  దిశానిర్దేశకత్వంలో దేశం ప్రగతిబాటన పయనిస్తోందని, మంచి పథకాలతో రైతులు, పేదలు, మహిళలు, యువత సహా అన్ని రంగాలకు చెందిన ప్రజల ఉన్నతికి బాటలు వేస్తున్న వారి చొరవను ప్రశంసించారు. ఇది భవిష్యత్ లో మరింత వేగంగా, క్షేత్ర స్థాయికి చేరుకోవాలని, పేదరిక నిర్మూలనకు మరింత కృషి జరగాలని ఆకాంక్షను వ్యక్తం చేసిన ఆయన, ఉచితాలను ప్రజలకు అలవాటు చేయవద్దని సూచించారు. అర్హులకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే నైపుణ్యాభివృద్ధి జరగాలని చెప్పారు. ప్రాథమిక స్థాయి మొదలుకుని సాంకేతిక విద్య వరకూ మాతృభాషలో బోధన ఉండాలన్న ఆయన, విద్యావ్యవస్థలో ఈ దిశగా త్వరితగతిన సానుకూల మార్పులను వేగవంతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానికి తెలిపారు.
పంచసప్తతి కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయులందరికీ ధన్యవాదాలు తెలిపిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాజకీయాల్లోకి యువత రావాలని ఆకాంక్షించారు. అయితే సిద్ధాంతపరమైన రాజకీయాలకు ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యత పెంచాలని, పార్టీ అభ్యర్థులకు ప్రవర్తనా నియమావళి రూపొందించాలని సూచించారు. అభ్యర్థుల గుణగణాలకు, సిద్ధాంతపర రాజకీయాలకు పెద్ద పీట వేయాలని సూచించారు. కులం, ధనం ప్రభావం పెరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని స్పష్టం చేశారు. సభ ఔన్నత్యాన్ని పెంచే విధంగా సభ్యులు ప్రవర్తించాలని ఆయన సూచించారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *