-78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించిన మహనీయుల త్యాగాల స్ఫూర్తిగా బంగారు భవిత నిర్మాణానికి, జిల్లా ప్రగతికి ఐక్యతతో సమష్టిగా కృషిచేద్దామంటూ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన పిలుపునిచ్చారు. గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విజయవాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సృజన.. జాయింట్ కలెక్టర్ డా. నిధిమీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీసీపీ టి.హరికృష్ణ, విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా వారం రోజులుగా జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హర్ ఘర్ తిరంగా జెండా పండగను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని, జాతీయ పతాక ఔన్నత్యాన్ని, విలువలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనకు స్వేచ్ఛను ప్రసాదించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. ఆ స్వేచ్ఛా ఫలాలను అనుభవించడంతో పాటు విధులు, బాధ్యతల విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తూ జిల్లా, రాష్ట్రం, దేశాభివృద్ధికి కలిసికట్టుగా కృషిచేద్దామని కలెక్టర్ సృజన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
విధి నిర్వహణలో ఉత్తమ పనితీరుకు ప్రశంస:
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది, సామాజిక సేవలో భాగస్వాములవుతున్న విశిష్ట వ్యక్తులకు కలెక్టర్ సృజన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎన్నికల సమయంలో విశేష సేవలందించిన ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, కలెక్టరేట్, సీపీ కార్యాలయ అధికారులు, సిబ్బంది; వివిధ శాఖల అధికారులు, సిబ్బంది; స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తదితర సంస్థల ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. మొత్తం 467 మందికి ఈ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నందిగామ ఆర్‌డీవో ఎ.రవీంద్రరావు, తిరువూరు ఆర్‌డీవో కె.మాధవి, కేఆర్ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ.కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.