Breaking News

యానాది తెగ సమగ్ర అభివృద్ధికి నాబార్డ్ “మా తోట నిధి” ద్వారా చేయూత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన అభివృద్ధికి పెద్దపీట వేసే నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లాలోని మడలు ఆధారంగా జీవించే యానాది తెగకు ఆర్థిక వనరులను అందించడం ద్వారా జీవనోపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టును కోడూరు మరియు నాగాయలంక మండలాల్లోని యానాది తెగలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇవాళ బుడితి రాజశేఖర్, IAS, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ మరియు సహకార శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల మీదుగా ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో పచ్చని ప్రకృతి సుందర సేద్యభూముల మధ్య ఉన్న నాగాయలంక గ్రామంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును మచిలీపట్నంకి చెందిన ప్రజా ప్రగతి సేవా సంగం (PPSS) నాబార్డ్ సహకారంతో అమలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నాబార్డు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ మేనేజర్‌ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ ప్రాజెక్టు యొక్క అనేక దశలను వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కోడూరు మరియు నాగాయలంక మండలాల్లో 400 యానాది తెగ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో 30 పడవలను, నెట్లు మరియు ఐస్ బాక్సులు సహా 150 మంది లబ్ధిదారులకు (ప్రతి 5 కుటుంబాలకు ఒక పడవను) అందించనున్నారు. అలాగే 30 కేజ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు, వాటివలన 180 కుటుంబాలు లబ్ధి పొందతాయి. అదనంగా, 30 కుటుంబాలకు మత్స్యకార పూడ్లు అభివృద్ధి చేయబడతాయి, 10 కుటుంబాలకు ఒక కేజ్ యూనిట్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రాజెక్టులో అక్వాకల్చర్ కోసం ఒక ఫీడ్ యూనిట్ నిర్మాణం, 20 నర్సరీలు మరియు 5 కమ్యూనిటీ నీటి ట్యాంకులను నిర్మించనున్నారు, వీటివల్ల పల్లెల్లోని ప్రజలకు మంచినీటి సదుపాయం కలుగుతుంది. లబ్ధిదారులకు విస్తృతమైన నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందించబడుతుంది. ఈ అవకాశం ద్వారా తమ పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీసుకోవాలని ఆయన యానాది తెగ ప్రజలకు సూచించారు.

బుడితి రాజశేఖర్, IAS ప్రాజెక్ట్ యొక్క వినూత్నతను ప్రశంసిస్తూ, ఈ ప్రాజెక్ట్ సాధారణంగా నిర్వహించే “మా తోట” ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా, మత్స్యకార మరియు అక్వాకల్చర్ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని, దీని వల్ల యానాది తెగకి చెందిన ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టును వేదికగా తీసుకొని వారు సాధికారంగా ఎదగాలని ఆయన సూచించారు. పిల్లలను గిరిజన పాఠశాలలు మరియు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో చేరుస్తూ, ఈ ప్రాజెక్టు ద్వారా పెరుగుతున్న ఆదాయంతో వారి భవిష్యత్తును కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్, ఇతర బ్యాంకులు మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో కలిసి మొదటి దశలో 55 లబ్ధిదారులకు పడవలు, నెట్లు, ఐస్ బాక్సులు, గమ్ బూట్లు మరియు గ్లౌవ్స్ పంపిణీ చేయబడ్డాయి.

ఈ సందర్భంగా, నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం తయారు చేసిన రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (FPOల) విజయగాధలను చూపించే కాఫీ టేబుల్ పుస్తకాన్ని మరియు PPSS రూపొందించిన ప్రాజెక్ట్ బ్రోచర్‌ను ముఖ్య అతిథి మరియు ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఎం.డి. డాక్టర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శారద మూర్తి, కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెన్నెల, మరియు కృష్ణ డీసీసీబీ సీఈఓ ఎ. శ్యామ్ మనోహర్ పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (SGB), మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ లోని మత్స్యకార మరియు గిరిజన సంక్షేమ అధికారుల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు వారి పూర్తి మద్దతును ప్రకటించారు.

ప్రియాంక, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, అవనిగడ్డ, మరియు కె. ప్రకాష్ రావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి, కృష్ణా జిల్లా కూడా ఈ కార్యక్రమానికి హాజరై, ఈ మార్గదర్శక ప్రాజెక్ట్ విజయానికి తమ మద్ధతు వ్యక్తం చేశారు. కోడూరు మరియు నాగాయలంక మండలాల నుండి వచ్చిన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *