-అఖండ గోదావరి, గండికోట అభివృద్ధికి సాస్కి ద్వారా రూ. 113.75 కోట్ల కేంద్రం నిధులు విడుదల
-వివరాలు వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్
-పర్యాటకాంధ్రప్రదేశ్ కు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటకాంధ్రప్రదేశ్ కు బాటలు వేస్తూ అఖండ గోదావరి, గండికోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కి (Special Assistance to States for Capital Investment) ద్వారా రూ.113.751 కోట్ల నిధులు విడుదలయ్యాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిధుల విడుదలకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సాస్కి స్కీం 2024-25 ద్వారా విడుదల చేసిన నిధులతో ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం వచ్చిందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఆచరణలో చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రం సాస్కి స్కీం ద్వారా తొలి విడతగా 66 శాతం నిధులు మంజూరు చేసిందని, ఆ నిధుల్లో 75 శాతం వినియోగించాక మిగతా 34 శాతం విడుదల చేస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకర్షించవచ్చని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్) లను కేంద్రానికి సమర్పించామని మంత్రి గుర్తుచేశారు.
భవిష్యత్ అంతా పర్యాటకానిదే, భవిష్యత్ లో ఏ ఇజం ఉండదు కేవలం టూరిజం మాత్రమే ఉంటుందని ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలను గుర్తుచేసిన మంత్రి దుర్గేష్ తదనుగుణంగా ఆ మాటలను నిజం చేస్తూ త్వరితగతిన నిధుల విడుదలకు సహకరించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక పర్యాటకానికి పరిశ్రమ హోదా ఇచ్చి రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి ఊతమిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై పర్యాటక శాఖ, దేవాదాయ, ఆర్ అండ్ బీ శాఖల మంత్రులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగిందని, అనంతరం ఢిల్లీలో డిప్యూటీ సీఎం పర్యటించి పర్యాటక శాఖ అభివృద్ధికి త్వరితగతిన నిధులు విడుదలకు చొరవ చూపించడంపై మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహకారం ఉంటుందని సెప్టెంబర్ లో బెంగుళూరులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో ఇచ్చిన హామీని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిలుపుకున్నారని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర పర్యాటక రంగంపై మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధతో, పర్యాటక శాఖ అధికారుల సమిష్టి కృషితో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కనుండటం హర్షించదగ్గ అంశం. త్వరలోనే పర్యాటక రంగంలో అభివృద్ధి ఊపందుకుంటదని ఆశిద్దాం.
Prajavartha Online Telugu News