Breaking News

45 రోజుల్లో భూ స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం

-రాష్ట్ర మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌
-సేవ‌ల‌న్నీ ఉచితం : జిల్లా క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్‌
-రెవెన్యూ స‌ద‌స్సుల‌ను ప్రారంభించిన మంత్రి

బొండ‌ప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ స‌ద‌స్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. బొండ‌ప‌ల్లి మండ‌లం గొట్లాం గ్రామంలో రెవెన్యూ స‌దస్సుల‌ను ఆయ‌న శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌నుంచి అర్జీల‌ను స్వీక‌రించారు. గ్రామ‌స‌భ వ‌ద్ద ఏర్పాటు చేసిన అర్జీ న‌మోదు కౌంట‌ర్‌, రెవెన్యూ రికార్డుల కౌంట‌ర్‌, రెవెన్యూ శాశ్వ‌త రికార్డుల కౌంట‌ర్ల‌ను అంత‌కుముందు ప‌రిశీలించారు. స‌ద‌స్సులో ముందుగా ముఖ్య‌మంత్రి సందేశాన్ని తాసిల్దార్‌ చ‌దివి వినిపించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్‌ మాట్లాడుతూ, ప్ర‌జ‌ల‌నుంచి వ‌స్తున్న విన‌తుల్లో ఎక్కువ భాగం భూ స‌మ‌స్య‌లేన‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన రీస‌ర్వే ప్ర‌క్రియ‌లో ప‌లు లోపాలు చోటుచేసుకున్నాయ‌ని, దీనివ‌ల్ల రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. స‌రైన విధానం, మార్గ‌ద‌ర్శ‌కాలు లేకుండా, త‌గిన స‌మ‌యం ఇవ్వ‌కుండా హ‌డావిడిగా స‌ర్వే చేయించార‌ని అన్నారు. రీస‌ర్వేలో జ‌ర‌గిన లోపాల‌పై సుమారు 9వేలకు పైగా ద‌ర‌ఖాస్తులు రావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌తీఒక్క‌రూ త‌మ భూముల రికార్డుల‌ను ఒక‌సారి ప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న భూస‌మ‌స్య‌లను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించడానికి ప్ర‌భుత్వం రెవెన్యూ స‌ద‌స్సుల‌కు శ్రీ‌కారం చుట్టింద‌ని తెలిపారు. ఇది గొప్ప స‌ద‌వ‌కాశామ‌ని, దీనిని వినియోగించుకోవాల‌ని కోరారు. ఈ-గ‌వ‌ర్న‌స్ విధానంలో వాట్సాప్ గ‌వ‌ర్న‌స్ విధానాన్ని మంత్రి లోకేష్ రూపొందిస్తున్నార‌ని, వాట్సాప్ ద్వారానే త‌మ‌కు కావాల్సిన ధృవ‌ప‌త్రాల‌ను, ఇత‌ర సేవ‌ల‌ను పౌరులు పొంద‌వ‌చ్చున‌ని మంత్రి తెలిపారు.

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ మాట్లాడుతూ, రెవెన్యూ సద‌స్సుల ద్వారా ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ పూర్తిగా ఉచితంగా పొంద‌వ‌చ్చున‌ని, ప్ర‌జ‌లు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ప్ర‌తీ సోమ‌వారం నిర్వ‌హించే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌లో 70 శాతానికి పైగా అర్జీలు రెవెన్యూ స‌మ‌స్య‌ల‌పైనే వ‌స్తున్నాయ‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని గుర్తించిన ప్ర‌భుత్వం, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రెవెన్యూ స‌ద‌స్సుల‌కు శ్రీ‌కారం చుట్టింద‌ని తెలిపారు. జిల్లాలోని 968 రెవెన్యూ గ్రామాల్లో కూడా స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. వీలైనంత వ‌ర‌కు అక్క‌డిక‌క్క‌డే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నామ‌ని చెప్పారు. జిల్లా అధికారులు, డిప్యుటీ క‌లెక్ట‌ర్లతోపాటు అన్ని శాఖ‌ల అధికారుల‌ను స‌ద‌స్సుల‌వద్ద అందుబాటులో ఉంచామ‌ని తెలిపారు. వ‌చ్చిన ఆర్జీల‌ను నిర్ణీత వ్య‌వ‌ధిలోగా ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు.

జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వ‌న్ మాట్లాడుతూ, రోజుకో గ్రామం చొప్ప‌న మొత్తం 33 రోజుల‌పాటు స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించేందుకు షెడ్యూల్‌ను రూపొందించామ‌ని తెలిపారు. ప్ర‌తీ అర్జీకి ర‌సీదును అంద‌జేస్తామ‌న్నారు. చిన్న స‌మ‌స్య‌పైన కూడా అర్జీ అంద‌జేయ‌వ‌చ్చున‌ని చెప్పారు. స‌ద‌స్సులు ముగిసిన 45 రోజుల్లోగా వ‌చ్చిన విన‌తుల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గ స్పెష‌ల్ ఆఫీస‌ర్ ప్ర‌మీలా గాంధీ, ఇన్‌ఛార్జి ఆర్‌డిఓ సుధారాణి, స‌ర్వేశాఖ ఎడి ర‌మ‌ణ‌మూర్తి, తాసిల్దార్ డి.రాజేశ్వ‌ర్రావు, ఇత‌ర రెవెన్యూ సిబ్బంది, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.

కార్పొరేష‌న్‌లో రెవెన్యూ స‌ద‌స్సును ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్
విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌ ప‌రిధిలోని అయ్య‌న్న‌పేట‌లో నిర్వ‌హించిన రెవెన్యూ స‌ద‌స్సును క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా విన‌తుల‌ను ఇవ్వ‌డానికి వ‌చ్చిన ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. వారి స‌మ‌స్య‌ల‌ను విన్నారు. క్షేత్ర‌స్థాయికి వెళ్లి వెంట‌నే వారి స‌మ‌స్య‌ను ప‌రిశీలించి రావాల‌ని ఆర్ఐల‌ను ఆదేశించారు. రెవెన్యూ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. వ‌చ్చిన కొన్ని అర్జీల‌పై అక్క‌డికక్క‌డే వాటిని ప‌రిష్క‌రించాల‌ని సూచించారు.

అంబేద్క‌ర్‌కు నివాళి
భార‌త‌ర‌త్న డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా, అంబేద్క‌ర్ విగ్ర‌హానికి క‌లెక్ట‌ర్, ఇత‌ర అధికారులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి.న‌ల్ల‌న‌య్య‌, స‌హాయ క‌మిష‌న‌ర్ తిరుమ‌ల‌రావు, మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఆర్ ఎస్ జాన్‌, తాసిల్దార్ కూర్మ‌నాధ్‌, కార్పొరేష‌న్ ఎసిపి హ‌రిబాబు, ర‌మ‌ణ‌మూర్తి, స‌ర్వేయ‌ర్ సింహాచ‌లం, గ్రూప్ టెంపుల్స్ ఈఓ కె.ప‌ద్మావ‌తి, స‌బ్ రిజిష్ట్రార్ టి.ర‌మేష్‌, డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ సుబ్బారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *