-ఈ నెల 23న ఎస్కెఎం నిరసనలకు సిపిఐ మద్దతు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ రోజు విజయవాడ దాసరి భవన్లో కామ్రేడ్ పి.దుర్గాభవాని అధ్యక్షతన జరిగింది. సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యుల రావుల వెంకయ్య పాల్గొని జాతీయ రాజకీయ పరిణామాలను గురించి వివరించగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కర్తవ్యాలను గురించి వివరించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పాల్గొన్నారు. సమావేశం ఈ తీర్మానం చేసింది.
తీర్మానం
కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా పంజాబ్`హర్యానా సరిహద్దు శింభు బోర్డర్ వద్ద జరుగుతున్న రైతాంగ ఆందోళన సందర్భంగా రైతులపై బాష్పవాయువు మరియు నీటి ఫిరంగులను ప్రయోగించడం అమానుషం. 17 మంది రైతులు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోపక్క రైతు నేత జగ్జీత్సింగ్ దల్లేవాల్ నవంబర్ 26 నుండి ఆమరణదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించి ప్రమాదకర స్థాయికి చేరకముందే కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాల ప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు సైతం సూచించింది.
సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని ఖండిస్తూ ఈ నెల 23న దేశ వ్యాపితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను అదానీలాంటి కార్పొరేట్లకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకోవాలని, రైతాంగ సమస్యల పరిష్కారానికి అన్ని రైతు సంఘాల ప్రతినిధులతో తక్షణమే చర్చలు జరపాలనే డిమాండ్లతో ఈనెల 23న మన రాష్ట్రంలో జరిగే నిరసనలకు సిపిఐ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది.
Prajavartha Online Telugu News