-టీడీపీపీ సమావేశంలో పాల్గొన్న ఎంపి కేశినేని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఈసమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ ఇతర ఎంపిలు,ముఖ్యనేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, నిధుల సాధనకు సంబంధించిన సమన్వయంపై సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేసినట్లు తెలిపారు.
డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్నో నిధులు, ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు రాష్ట్రానికి రావటం జరిగిందన్నారు. గత 5ఏళ్ళు కేంద్రం నుంచి జగన్ ప్రభుత్వం సాధించిందేంటి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోదీ సహకారంతో కేంద్రం నుంచి తెచ్చిందేంటీ అనేది ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి బడ్జెట్ లో రాష్ట్రానికి కావాల్సిన ప్రతిపాదనలు అందచేశారని, డబుల్ ఇంజిన్ సర్కార్ తోడ్పాటు తో ఈసారి బడ్జెట్ లో ఏపీకి మెరుగైన కేటాయింపులే ఉంటాయన్నారు. అలాగే ఈ బడ్జెట్ లో జల్ జీవన్ మిషన్ లో భాగంగా ప్రతీ ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పనపై కేటాయింపులు ఆశిస్తున్నట్లు తెలిపారు.