విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక అవసరతలు ఉన్న విద్యార్థులకు బాసటగా నిలుస్తూ వారిని ప్రేమతో ఆదరిస్తున్న భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కొనియాడారు. ప్రిన్సిపల్ సునీత జన్మదిన సందర్భంగా విద్యాధరపురంలోని భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను గురువారం ఆయన సందర్శించారు. ప్రిన్సిపల్ సునీత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులతో ముచ్చటించి వారి యోగక్షేమాల గురించి వివరాలను అడిగి తెలుసుకొని వారితో కాసేపు గడిపారు. భవిత్ సెంటర్ ఆధ్వర్యంలో వివిధ కారణాలతో ప్రత్యేక అవసరతలకు గురైన చిన్నారులకు చేయూతనివ్వడం హర్షనీయమన్నారు. ధైర్యం కోల్పోకుండా మానసిక అంశాలపై శిక్షణనిస్తూ వారికి అండగా నిలబడుతున్న ప్రిన్సిపల్ జే సునీత, ప్రసాద్ దంపతుల కృషిని అభినందించారు. ఎంతో ఓర్పుతో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ లో శిక్షణనిస్తున్న భవిత్ సెంటర్ కు తమ వంతు సహకారం అందిస్తామని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీయే కూటమినేతలు వెంపలి గౌరీ శంకర్, సమ్మెట రాజా నాయుడు, గడ్డిపాటి కిరణ్, చింతా సృజన్ తదితరులు పాల్గొన్నారు.
