-ఫిబ్రవరి 3 న డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమావేశం కొరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేసిన జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్… ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
-పార్టీ ప్రతినిధులు విప్ జారీ ప్రతులను సంయుక్త కలెక్టర్ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం (నేడు) ఉదయం 9 గం. నుండి 11 గంటల లోపు జెసి ఛాంబర్ నందు అందజేయాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమ ప్రత్యేక సమావేశం ఫిబ్రవరి 3వ తేదీన పకడ్బందీగా ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను జెసి మరియు సదరు ఎన్నికల నిర్వహణ ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరం నందు సంబంధిత అధికారులతో డిప్యూటీ మేయర్ ప్రత్యేక సమావేశ ఏర్పాట్లపై జేసీ మరియు ప్రిసైడింగ్ అధికారి సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాల్ నందు సీటింగ్ ఏర్పాట్లు, మీడియా ఏర్పాట్లు, రో ఆఫీసర్ల ఏర్పాటు బ్యారికేడింగ్ తదితర అంశాలు నిబంధనల మేరకు ఉండాలని, అలాగే ఎన్నికల ప్రక్రియ పూర్తి వీడియో రికార్డింగ్ ఉండాలని సూచించారు. సంబంధిత పార్టీ ప్రతినిధులు విప్ జారీ ప్రతులను సంయుక్త కలెక్టర్ గారికి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ఉదయం 9 గం. నుండి 11 గంటల లోపు అందజేయాల్సి ఉంటుందని, కలెక్టరేట్ నందు జేసీ చాంబర్ నందు వారు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫిబ్రవరి మూడో తేదీ ప్రత్యేక సమావేశం 11 గంటలకు నిర్వహించనున్న నేపథ్యంలో సంబంధిత కౌన్సిలర్లు మరియు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 11 గం.ల కంటే ముందుగా సెనేట్ హాల్ నందు హాజరు కావాలని, సెల్ ఫోన్లు అనుమతి లేదని, రిలేటివ్స్ కు అనుమతి లేదని, ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకుని రావలసి ఉంటుందని ఎన్నికల నిర్వహణ అధికారి సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి,జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, తహసీల్దార్ భాగ్యలక్ష్మి , సెక్రటరీ రాధిక, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News