-5వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-హోరేబు మినిస్ట్రీస్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్లోని పెదబావి సెంటర్ సమీపంలో కొండ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా తెల్సుకున్నారు. కొండ ప్రాంతంలో రోడ్లు, రెయిలింగ్, మెట్లు నిర్మాణం చేయాలని స్థానికులు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ను కోరారు.అనంతరం అక్కడ ఉన్న హోరేబు మినిస్ట్రీస్ చర్చిను సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రార్థనల్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గోన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కొండ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో చాలా వరకు రోడ్లు, మెట్లు, ర్యాంపులు నిర్మాణంతో పాటుగా మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. కొండ ప్రాంతాల్లో మంచినీటి సమస్య పరిష్కరించడానికి నాలుగు వాటర్ ట్యాంక్‌లను నూతనంగా తమ ప్రభుత్వం నిర్మాణం చేయనుందని అన్నారు. కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్య రాకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం పరిష్కరిస్తున్నామని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హాయంలో కొండ ప్రాంతాల్లోని సమస్యలను పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఈ డివిజన్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 2014–19 సంవత్సరాల టీడీపీ హాయంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు కేటాయించి శంకుస్థాపన చేశామని, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణ చేయనీయకుండా అడ్డుకుని పనులు నిలిపివేసిందని అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు నందిపాటి దేవానంద్, పాస్టర్ వేముల విజయ్‌ప్రసాద్, నాగూరి సురేష్‌బాబు, గద్దె రమేష్, తలారి విజయ్ , దారా గోవిందు, ఇశ్రాయేలు, కే.మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News