-ఉపాధి హామీకి మొండిచేయి..
-కార్పొరేట్, పెట్టుబడిదారి వర్గాలకు లబ్ది
-ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పార్లమెంట్లో ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంతా పాతదనమేనని, అందులో కొత్తదనం ఏమీ లేదని, ఈ బడ్జెట్ వల్ల పేదలకు ఏమి ఒరిగింది లేదనీ, ఆహార ధరలు తగ్గింపు కానీ, ఆరోగ్యం, విద్య, వైద్యం, వివిధ సంక్షేమ పథకాల గురించి ఏ మాత్రమూ కనికరించలేదని, నామమాత్రపు కేటాయింపులతో గొప్పలు చెబుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రావ్ ఆక్షేపించారు. బడ్జెట్లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, పేదల సంక్షేమం, అభివృద్ధి ప్రస్తావనే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదల వ్యతిరేక బడ్జెట్ అని, ఇందులో ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు చాలా దారుణంగా కుదించారని, గతేడాది వలే..ఈ సంవత్సరమూ కేవలం రూ.86 వేల కోట్లతోనే సరిపెట్టి..వలసలకు వెళ్లవచ్చనే సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఉపాధి హామీ పట్ల బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్లుగా ఈ బడ్జెట్లో స్పష్టత ఇచ్చిందన్నారు. ప్రతేటా ఉపాధి హామీలో జాబ్ కార్డులు కావాలని నమోదు చేసుకునే పేదలు సంఖ్య పెరుగుతుంటే, డిమాండ్ కనుగుణంగా ఈ బడ్జెట్లో గత ఏడాది కంటే ఎక్కవ నిధులు కేటాయించాలానే ఇంగిత జ్ఞానమూ లేకపోవడమూ చాలా దారుణమని తెలిపారు. ఉపాధిలో రోజువారీ వేతనం రూ.700లతోపాటు 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడా ఆచరణలోకి తేలేదన్నారు. ఉపాధి హామీ పనులు వల్లే గ్రామీణాభివృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడటానికి కారణమని ఒకవైపు ఆర్థికవేత్తలు చెబుతున్నప్పటికీ, కేటాయింపులన్నీ..ఉత్పత్తిచేసే శ్రమజీవులను విస్మరించి కార్పొరేట్లు, పెట్టుబడి దారులకే భారీ లబ్ది చేకూర్చేలా ప్రధాని మోదీ నేతృత్వంలోని బడ్జెట్ రూపుదిద్దుకుందని సంఘం నేతలు జల్లి విల్సన్, సిహెచ్.కోటేశ్వరరావు, ఆవుల శేఖర్, వెంకట్రావ్ తప్పుపట్టారు.
Prajavartha Online Telugu News