-భక్తులకు ట్రాఫిక్, శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
-గత ఐదేళ్లలో కోటప్పకొండ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయ్యింది
-కోటప్పకొండను అభివృద్ధి చేసిన ఘనత కోడెలదే
-రానున్న రోజుల్లో కోటప్పకొండను మరింత అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది
-పల్నాడు ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి\పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త :
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగే తిరునాళ్లకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని శనివారం దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఫిబ్రవరి 26వ తేదీ జరిగే కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. దర్శనం క్యూలైన్లను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అదే విధంగా పారిశుద్ధ్యం, తాగునీరు నిర్వహణను పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కొండ పైకి వెళ్లే మార్గంలో ఉన్న పిల్లల పార్క్, జంతు ప్రదర్శన శాల, బోటింగ్ పాయింట్లనూ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పరిశీలించారు.
కోటప్పకొండను అభివృద్ధి చేసిన ఘనత కోడెలదే
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దేవాలయ నిర్వహణ అస్తవ్యస్తమై భక్తులకు దర్శనం కూడా ఇబ్బందిగా మారిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటుతో పాటు పిల్లల పార్క్, జంతు ప్రదర్శన శాల, బోటింగ్ పాయింట్లకు వెంటనే మరమత్తులు చేయించాలన్నారు. మహా శివరాత్రి ఏర్పాట్లతో పాటు త్రికోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు.
కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో జరిగే మహా శివరాత్రి తిరునాళ్లు… రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి అని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కోటప్పకొండ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యిందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోడెల శివప్రసాద్ రావు కోటప్పకొండను అభివృద్ధి చేశారని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోటప్పకొండకు పూర్వ వైభవాన్ని తెస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, అరవింద్ బాబులతో పాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News