Breaking News

మిర్చి రైతుల గోడు కూటమి ప్రభుత్వానికి పట్టదా..?

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మిర్చి రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఓ వైపు ధరలు పడిపోయి దిగుబడి లేక రైతన్నలు కష్టాలు పడుతుంటే.. కూటమి సర్కార్ కు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. గత నాలుగేళ్లు లాభాలు చూసిన రైతన్నలు.. ఈ ఏడాది ధరలు పడిపోవటంతో కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలలో సుమారు 1.96 లక్షల హెక్టార్లలో మిర్చి సాగైందని మల్లాది విష్ణు చెప్పారు. 11.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్సి ఉన్నా.. తామర, జెమిని వైరస్ ల ప్రభావంతో ఈ ఏడాది దిగుబడి దారుణంగా పడిపోయి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి కూడా లేదని వెల్లడించారు. పైగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండటంతో ఎన్టీఆర్ జిల్లాలో సాగు చాలా వరకు తగ్గిపోయిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఉదాహరణకు గతేడాది నందిగామ నియోజకవర్గంలో 8 వేల ఎకరాలలో మిర్చి సాగు చేయగా.. ఈ ఏడాది 5,374 ఎకరాలకే పరిమితం అయిందన్నారు. అలాగే జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలలోనూ గతేడాదితో పోలిస్తే మిర్చి సాగు చాలా వరకు పడిపోయిందని చెప్పారు. మరోవైపు గతంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి సాగు పెడ్డుబడులు భారీగా పెరిగాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎరువులు, పురుగుల మందుల ధరలు, కూలీలు, రవాణా ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయన్నారు. ఫలితంగా ఎకరాకు రూ. 1.50 లక్షల వరకు రైతన్నలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని.. అయితే గోరుచుట్టుపై రోకలి పోటులా ధరలు రైతన్నకు కంట తడి పెట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జగనన్న పాలనలో రికార్డు స్థాయిలో ధరలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మిర్చి రైతుకు స్వర్ణ యుగమని మల్లాది విష్ణు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ధరలు లభించటంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహంతో దిగుబడులు బాగా వచ్చాయన్నారు. అప్పట్లో రైతుకు ఎకరాకు 20 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేదని.. పైగా సీజన్ కు ఐదు నుంచి ఆరు సార్లు రైతులు కోతలు కోసే వారని గుర్తు చేశారు. కానీ ఈ ఏడాది రెండు నుంచి మూడు కోతలతో సరిపెట్టుకోవాల్సి రావటం బాధాకరమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో క్వింటా రూ. 25 వేలు పలికిన మిర్చి ధర.. ఈ ఏడాది రూ. 13 వేలు మించి పలకకపోవటం శోచనీయమన్నారు. మరోవైపు దిగుమతి వ్యాపారులు కమీషన్ పేరుతో దండుకుంటుండటంతో రైతులు పడుతున్న బాధలు వర్ణాణాతీతమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిర్చి సహా అన్ని పంటలకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *