– ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి
– ప్రపంచ వినికిడి దినోత్సవ ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వారి ఆరోగ్యకర జీవితానికి మంచి పునాది వేయొచ్చని.. చెవి సంరక్షణ, వినికిడి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ.. జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలోచనా విధానాన్ని మార్చుకొని.. చెవి సంరక్షణ, వినికిడి ఆరోగ్యంపై సాధికారత సాధిద్దాం.. ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తొలిదశలోనే వినికిడి లోపాలు గుర్తించి, సరైన వైద్యం అందించడం ద్వారా లోపాలను తొలగించవచ్చన్నారు. వినికిడి సమస్యలకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వైద్యాధికారులు, ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు బృందంగా చొరవచూపాలన్నారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, సీపీవో వై.శ్రీలత, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, పీవో-యూసీడీ వెంకటరత్నం, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, NCD కార్యక్రమం అధికారి డాక్టర్ మాధవి నాయుడు, ఎల్డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News