-మహిళా మణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
-మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కీర్తించిన మంత్రి దుర్గేష్
-త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ అంటూ అభివర్ణన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు(శనివారం)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మణులకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తోందని జర్మనీ పర్యటనలో ఉన్న మంత్రి దుర్గేష్ ఈ మేరకు ప్రకటనలో పేర్కొన్నారు. మహిళామూర్తులకు పురుషులందరూ దన్నుగా నిలవాలని మంత్రి దుర్గేష్ సూచించారు. మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కీర్తించారు. మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ.. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ అంటూ అభివర్ణించారు.స్వాతంత్రోద్యమ సమయంలో మొట్టమొదటగా కత్తిపట్టిన వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి దగ్గర్నుంచి నేటి చెడు మీద పోరాటం చేస్తున్న ప్రస్తుత ప్రజా ప్రతినిధుల వరకు ఎందరో మహిళామణులు విస్తృతంగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో మహిళా హక్కులు హరించబడ్డాయని, మహిళాశక్తి సన్నగిల్లిపోయిందని విమర్శించారు. ప్రపంచంలోని ప్రతి విజయవంతమైన సమాజం వెనుక బలమైన సాధికారత కలిగిన మహిళ ఉంటుందన్నారు. తల్లిగా,సోదరిగా, భార్యగా, కూతురుగా జీవితంలోని ప్రతి దశలో మగవాడిని నడిపించేది మహిళ అని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. స్త్రీని గౌరవిద్దాం .. ఆమెకు సంరక్షణ గా ఉందామని సమాజానికి మంత్రి కందుల దుర్గేష్ సూచించారు..
Prajavartha Online Telugu News