విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయస్థాయిలో అంతర విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవాల్లో కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పోటీపడ్డ ఆరు అంశాల్లోనూ గెలుపొంది 6వ సారి ఓవరాల్ ఛాంపియన్షిప్ తో విజయవాడ పి.బి.సిద్ధార్థ కళాశాల విజయకేతనం ఎగరవేసింది. సోమవారం ఉదయం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ బసవేశ్వరరావు విజేతలకు పతకాలు, ప్రశంసపత్రాలు అందజేశారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నోయిడాలోని ఎమిటీ వర్సిటీలో మార్చి 3-7 తేదీల్లో నిర్వహించిన క్లాసికల్ వోకల్, ఇండియన్ గ్రూప్ సాంగ్, మెహందీ అంశాల్లో పి.బి. సిద్ధార్థ మొదటి బహుమతులు గెలుచుకుని తన సత్తా చాటుకుంది. కాగా, క్లాసికల్ ఇన్ స్ట్రుమెంటల్ (తంత్రీవాయిద్యం..పెర్కషన్..) విభాగంలో ద్వితీయ బహుమతి, తంత్రీయేతర నాన్ పెర్కషన్ సంగీతవిభాగంలో, 9 మందితో కూడిన ఫోక్ ఆర్కెస్ట్రా గ్రూప్ సాంగ్ అంశంలో తృతీయ బహుమతులు గెలుచుకుంది. మొత్తంమీద సంగీత విభాగంలో జాతీయస్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. గత 6 సంవత్సరాలుగా కృష్ణా యూనివర్సిటీ పరిధిలో 6 అంశాల్లో మొదటి స్థానంలో నిలుస్తూ, సౌత్ పోటీల్లో కూడా విజేతగా నిలుస్తూ జాతీయస్థాయిలో ఓవరాల్ చాంపియన్షిప్ తో సిద్ధార్ధ సరికొత్త చరిత్ర సృష్టించిందని కన్వీనర్ డాక్టర్ బి. జయప్రకాష్ పేర్కొన్నారు. గతంలో బెంగళూరులో జైన్ యూనివర్సిటీలో, లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ వర్సిటీలో జరిగిన అంతర విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవ పోటీల్లో కూడా సిద్ధార్థ ఓవరాల్ ఛాంపియన్షిప్ తో విజేతగా నిలిచిందని కోఆర్డినేటర్ ఎం. శివరంజని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ సి.జంపాల, పి.బి. సిద్ధార్థ ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.రామోజీ తదితరులు పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. విజేతలకు వారు కళాశాలకు చెల్లించిన ఫీజు వాపసు చేస్తూ మరిన్ని ఆర్థిక ప్రోత్సాహకాలు అందచేస్తున్నట్లు వారు ప్రకటించారు.
Prajavartha Online Telugu News