-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు.
-ఆహార వినియోగానికి మాత్రమే కాకుండా ఇథనాల్ ఉత్పత్తికి కూడా చాలా అవసరమైన పంట
-స్టార్చ్ , ఫార్మా ఉత్పత్తులకు ,పేపర్ ,పౌల్ట్రీ మరియు పశువుల దాణా తయారీలోనూ ప్రధాన ముడిసరుకుగా వుండి వాణిజ్య మార్కెట్ లో డిమాండ్ పెంచుకుంటున్న మొక్కజొన్న పంట
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది.12/03/25 న విజయవాడ లో మొక్కజొన్న సాగులో దిగుబడులు పెంచటానికి నూతన సాంకేతిక ఆవిష్కరణలు – సాగు సమస్యలు – అధిగమించే పద్ధతులు అనే అంశంపై రాష్ట్రములోని మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఎక్కువగా వున్న గుంటూరు ,బాపట్ల, అనంతపూర్,శ్రీ సత్యసాయి,నంద్యాల ,కర్నూలు ,ఏలూరు ,యన్ టి ఆర్,శ్రీకాకుళం జిల్లాలలోని ఎంపిక చేసుకున్న ఔత్సాహిక రైతులు ,ఎగుమతి దారులు,ప్రాసెసింగ్ యూనిట్ వారు ,వ్యవసాయ అధికారులు ,శాస్త్రవేత్తలతో రాష్ట్ర స్థాయి కార్యశాల జరిగింది.
ఈ కార్యక్రమములో డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్, డాక్టర్ పి వి సత్యనారాయణ, వ్యవసాయ సంచాలకులు,ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శాస్త్ర వేత్తలు చంద్రమోహన్ రెడ్డి, లామ్ సుదీర్ కుమార్, ఫణి కుమార్, రామభద్ర రాజు, ప్రసాద్ ,అడిషనల్ డెరైక్టర్ ,కమిషనర్ కార్యాలయం, విజయ భారతి ,సంయుక్త సంచాలకులు , ఎన్ సి బాలు నాయక్ , వ్యవసాయ ఉప సంచాలకులు,వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు .
కార్యక్రమములో డిల్లిరావు ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ మొక్కజొన్నకు గత కొన్ని సంవత్సరాల నుండి దేశీయముగా ఆహార వినియోగదారుల అవసరాలకు మాత్రమే కాకుండా,ఎగుమతులకు అవకాశం ఎక్కువుగా వుండటం ,ఉత్పత్తి ఉత్పాదకత పెరుగుదలలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు కారణముగా మన దేశములో మొక్కజొన్న సాగుకు విపరీతమైన వాణిజ్య అవకాశాలు మెరుగు అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వారి బయోఇంధనాల జాతీయ విధానం 2018 ను అనుసరించి వాహన రంగములో ఇంధనం వాడే పెట్రోల్ లో తప్పనిసరిగా 20 శాతం ఇథనాల్ కలపాలని ఇచ్చిన కేంద్ర e -20% ఆదేశాలకు ,ఇథనాల్ ముడి సరుకు గా గల మొక్కజొన్న కు మరింత డిమాండ్ పెరిగిందని తెలిపారు .రాబోవు కాలంలో ఇథనాల్ మిశ్రమాన్ని 50 శాతం పెంచే అవకాశం ఉంటుంది అని తెలిపారు .కావున మొక్కజొన్న కు నిరంతరముగా నిలకడగా మార్కెట్ డిమాండ్ వుంటుందని తెలిపారు.
పరిశోధన సంచాలకులు డాక్టర్ పి వి సత్యనారాయణ మాట్లాడుతూ మన దేశం మొక్కజొన్న సాగు ప్రపంచ మొక్కజొన్న విస్తీర్ణం లో 4 వ స్ధానం ,ఉత్పత్తిలో 7 వ స్ధానం లో వుందని తెలిపారు .మొక్కజొన్న పంట 10 డిగ్రీల ఉష్ణోగ్రత నుండి 36 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పండగలదని తెలిపారు .గుంటూరు జిల్లా ఉత్పాదకత లో హెక్టారుకు 12 మెట్రిక్ టన్నులు సాధించి దేశములోనే అధికముగా నిలిచిందని తెలిపారు.
చంద్రమోహన్ రెడ్డి మొక్కజొన్న సాగులో వివిధ రకాల ఎంపిక ,వాటి లక్షణాలు తెలిపారు .కోత మరియు కోత అనంతర విధానాలపై చర్చించారు. శాస్త్ర వేత్తలు తెగుళ్ల ,పురుగుల మరియు కలుపు యాజమాన్యం పై ప్రసంగించారు . ఏలూరు జిల్లా ముసునూరు మండలం రైతు యనమదల యుగంధర్ మాట్లాడుతూ మొక్కజొన్న కోత వ్యయప్రయాసలకు లోనై వున్నందున మొక్కజొన్న మొక్క నుండి కండెను వేరు చేసే *కండేతీత యంత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అని అవి రాయితీపై ఎక్కువ సంఖ్యలో అందించాలని కోరారు .రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
కార్యక్రమములో వ్యవసాయ ఉప సంచాలకులు ఎన్ సి బాలు నాయక్ వందన సమర్పణ చేశారు.
Prajavartha Online Telugu News