మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకారం అందించాలని గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను కోరారు. బందరు స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మచిలీపట్నం నగర పరిధిలోని పాత రైల్వే స్టేషన్ నుంచి బందరుకోటకి వెళ్లే రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఇతర కూటమి నాయకులతో కలిసి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో మచిలీపట్నం పోర్టు రోడ్డుకు ఎంతో ప్రత్యేకత ఉందని, గతంలో పోర్టుకు వెళ్లేందుకు ఈ రహదారిని ప్రధానంగా ఉపయోగించడం వల్ల పోర్టు రోడ్డుగా ప్రసిద్ధి చెందిందని నాటి సంగతులను మంత్రి గుర్తు చేశారు. తర్వాతి క్రమంలో రహదారి పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో అధ్వానంగా తయారైందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్వచ్ఛ బందరు కార్యక్రమంతో మొత్తం శుభ్రం చేశామన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డును మరింత సుందరీకరణగా తీర్చిదిద్దే క్రమంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి పచ్చదనంతో ఆహ్లాదకరంగా మార్చేందుకు నేటి కార్యక్రమంతో శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వం, కూటమి నాయకుల సహకారంతో నగరం మొత్తాన్ని ఇదే రీతిలో పచ్చదనంగా మార్చేందుకు, రహదారులను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా నగరంలో రహదారులకిరువైపులా ఉన్న ఆక్రమణలను ఇప్పటికే తొలగిస్తూ వస్తున్నామని, అయితే చేస్తున్న ఈ పనిని అతి తక్కువ మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ అధిక మొత్తంలో ప్రజలందరూ హర్షిస్తున్నారన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, తమ సలహాలు, సూచనలతో బందరు అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. విజన్ 2047, పీ4 కార్యక్రమాలు పేదరికం లేని సమాజ నిర్మాణం, పరిశుభ్రత, సుందరీకరణ, పట్టణ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలన్నారు. నగరంలోని రహదారులపై పశువుల సంచారంతో ప్రమాదాలకు ముప్పుగా మారిందని, దీనిని అధిగమించేందుకు మంగినపూడి బీచ్ ప్రాంతంలో 15 ఎకరాలు కేటాయించి, పట్టించుకోని పశువులను అక్కడకు తరలించడం జరుగుతుందన్నారు. జిల్లా పరిధిలోని ముడా ఏరియాని సి ఆర్ డి ఏ రాజధాని పరిధిలోకి తీసుకువచ్చే విధంగా జిల్లాలోని ముఖ్య నాయకులతో త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థిస్తామన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత రెండూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలని, ఆ స్పూర్తితో మచిలీపట్నం నగరాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారన్నారని, వారి సహకారంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, కుంచె నాని, తలారి సోమశేఖర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, జిల్లా ప్రజా రవాణా అధికారి వాణీశ్రీ, మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజులు, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News