తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ వారి చొరవతో గుర్గాన్ లో ఉన్న REC ఫౌండేషన్ వారు ఎస్.వి.ఆర్.ఆర్. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, తిరుపతి హస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా పేద రోగుల వైద్య సదుపాయాల నిమిత్తం సుమారు రూ.5.25 కోట్ల విలువైన పరికరాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వితరణ చేయడానికి సమ్మతించారు. దాని నిమిత్తం ఒప్పందం కుదుర్చుకోవడానికి విజయవాడ ప్రాంతీయ విభాగంలోని అధికారులు సంజయ్ కుమార్ రాయ్, చీఫ్ ప్రోగ్రాం మేనేజర్, ఆర్.ఇ.సి., శ్రావణ్ కుమార్ సింగ్, రీజనల్ ఆఫీసర్, విజయవాడ వారు గౌరవపూర్వకంగా తిరుపతి కలెక్టరు గారి సమక్షంలో ఎస్.వి.ఆర్.ఆర్. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, తిరుపతి పర్యవేక్షణాధికారి డా.జి.రవిప్రభు గారితో నేటి శనివారం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగినది. దీని ప్రకారము ఆరు నెలల వ్యవధిలో ఈ విలువైన ఆసుపత్రి పరికరాలను రుయా ఆసుపత్రికి వితరణకు సమకూర్చడానికి ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి పర్యవేక్షణాధికారి డా.జి.రవిప్రభు ఎస్.వి.ఆర్.ఆర్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, తిరుపతి వైద్య మరియు ఇతర సిబ్బంది తరపున తిరుపతి జిల్లా కలెక్టరు కి కృతజ్ఞతలు తెలిపారు
Prajavartha Online Telugu News