– లక్ష్యాల సాధనలో అధికారులే రథ సారథులు
– వికసిత్ ఎన్‌టీఆర్ జిల్లా సాకారానికి సమష్టిగా కృషిచేద్దాం
– ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దామని.. లక్ష్యాల సాధనలో అధికారులే రథ సారథులని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు.
శనివారం లంకా దినకర్ అధ్యక్షతన కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తదితరులు హాజరయ్యారు.
గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమైన వికసిత్ భారత్ – 2047, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు రూపమైన స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు తద్వారా వికసిత్ ఎన్‌టీఆర్ జిల్లా సాకారానికి అవసరమైన కార్యాచరణ, సవాళ్లను అధిగమించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై సమావేశంలో చర్చ జరిగింది. ఉపాధిహామీపథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం, 2019-24 మధ్య అవకతవకలు, ప్రతి గ్రామంలో ప్రతి గృహానికి సురక్షిత తాగునీరు అందించే సంకల్పంతో అమలవుతున్న జల్ జీవన్ మిషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఇచ్చిన నిధుల పనుల్లో మందగమనం, విజయవాడ బైపాస్ పనుల పురోగతి, అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాలు, గ్రామీణసడక్ యోజన, లఖ్‌పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, పీఎంసూర్యఘర్, కుసుమ్, పీఎం ఆవాస్ యోజన, టిడ్కో గృహాలు, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుపై సమావేశంలో చర్చించారు.
అనంతరం లంకా దినకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పులిచింతల, ప్రకాశం బ్యారేజీ దీర్ఘకాలిక వనరుల ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు సురక్షిత తాగునీరు ఇచ్చే లక్ష్యానికి అవసరమైన ఓవర్ హెడ్ ట్యాంకులు, ఫిల్టర్లు, పైప్ లైన్లతో సవరించిన డీపీఆర్‌తో జల్ జీవన్ మిషన్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత అయిదేళ్లలోని అస్తవ్యస్త విధానాలతో కాకుండా వనరుల సద్వినియోగమయ్యేలా స్పష్టమైన ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచన ఇవ్వడం జరిగిందన్నారు.
విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కేంద్రప్రభుత్వం 2016లో రూ. 460 కోట్లు విడుదల చేసినా ఇప్పటివరకు పూర్తికాకపోవడానికి కారణం 2019 – 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడం ముఖ్యంగా కార్పొరేషన్ నిధులు డైవర్షన్ చేసినందున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తికాలేదన్నారు. తొమ్మిదేళ్ల కిందట వేసిన అంచనాలతో ఇప్పుడు పని పూర్తికాదు కాబట్టి సవరించిన అంచనాలతో డీపీఆర్ తయారు చేసి, నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. ఒక రోజుకు ఉపాధిహామీ వేతనం రూ. 300 అయితే జిల్లాలో సగటున రూ. 260.27 ఉందని.. మొత్తం ఉపాధి కూలీలలో 45% పైగా ఎస్‌సీ, ఎస్‌టీలు ఉన్నారని, మొత్తం వేతనదారుల్లో 50 % పైగా మహిళలు ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయని.. వేతనదారులకు రూ. 300 వచ్చేలా అధికారులు కృషిచేయాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 49,358 మంది మహిళలను లఖ్‌పతి దీదీలుగా తీర్చిదిద్దాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అంతకుమించి 50,470 మందిని గుర్తించడం జరిగిందన్నారు. డ్రోన్లను పైలట్ ప్రాజెక్ట్ కింద స్వయం సహాయక గ్రూపులకు అందించి, శిక్షణ ఇవ్వడం ద్వారా చిన్న, సన్నకారుల రైతులకు లబ్ధి చేకూరుతుందని, కేంద్ర ప్రభుత్వం డ్రోన్లపై సబ్సిడీ ఇస్తోందన్నారు.
భవానీ ద్వీపంలో వసతులకు రూ. 18 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందాయని.. ప్రకాశం బ్యారేజ్, పవిత్ర సంగమంలను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాల నిర్వహణపైనా చర్చ జరిగినట్లు తెలిపారు. కొండపల్లి కోటను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి, కొండపల్లి బొమ్మలకు అవసరమైన ముడి సరుకుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. గాంధీ హిల్, బాపు మ్యూజియం, అంబేద్కర్ స్మృతి వనం పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేయాలని సూచించడం జరిగిందన్నారు. ఎన్‌టీఆర్ జిల్లాలో సేవల రంగంలో ఉపాధి అవకాశాలు పెంచి స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అయ్యే విధంగా అధికారులు కృషిచేయాలని సూచించినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలతో ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
ఇంకా ఏమన్నారంటే..:
– జల్‌జీవన్ మిషన్‌కు సంబంధించి 2019 – 24 మధ్య నాణ్యత లేకుండా పనులు చేయడం లేదా సకాలంలో పనులు పూర్తి చేయకపోవటం, పురోగతి లేని కాంట్రాక్టులు రద్దు చేసి, దీర్ఘకాలిక నీటి వనరుల ఆధారంగా పనులు పునః ప్రారంభం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదు.
– 2019 – 24 మధ్య నాటి ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల 2019 ముందు కేటాయించిన ఎన్టీఆర్ హౌసింగ్ లబ్దిదారుల దయనీయ పరిస్థితిపైనా నివేదిక కోరడం జరిగింది.
– పీఎం సూర్య ఘర్ పథకం అమలులో వేగం పెంచాలి. ఈపథకం కింద కనిష్టంగా రూ. 30 వేలు, గరిష్టంగా రూ. 78 వేలు రాయితీని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. స్వయం సహాయక సంఘాల గ్రూపులతో అనుసంధానమై నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశించడం జరిగింది.
– నాణ్యమైన, నిరంతరాయ వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకం పురోగతిపైనా ప్రత్యేక దృష్టిపెట్టడం జరిగింది. ఇప్పటికే 145 ఫీడర్లు ఉండగా, కొత్తగా 63 ఫిడర్స్ ఎంపిక చేసి మొత్తం 56 మెగావాట్ల ప్లాంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు.
– జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1,22,204 మంది రైతులు సంవత్సరానికి రూ. 6 వేలు కిసాన్ సమ్మాన్ నిధి సహాయం పొందుతున్నారు. గత ఆరేళ్లలో రూ. 440.23 కోట్ల లబ్ధి జిల్లాలోని రైతులకు చేకూరింది.
– ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రకృతి సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రైతులకు ప్రకృతి సేద్యంపై అపోహలను తొలగించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
– పీఎం విశ్వకర్మ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయంతో 18 రకాల చేతి వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, రూ. 15 వేల విలువైన టూల్ కిట్, సబ్సిడీ, తక్కువ వడ్డీపైన బ్యాంకు రుణం కోసం జిల్లాలో 48,308 దరఖాస్తులు రాగా, 2,893 వేల మందికి శిక్షణ పూర్తయి 516 మందికి బ్యాంకుల నుండి రుణాలు ఆమోదం వచ్చి 407 మందికి రుణాలు మంజూరయ్యాయి.
– రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలురకం పశువుల సంతాన ఉత్పత్తిని పెంచడం, ఆవులు, గేదెలను సబ్సిడీ పై రుణాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెంచి గ్రామాలలో నివసించే వారికి అదనపు ఆదాయం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది.
———————–
కలసికట్టుగా జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం: ఎంపీ కేశినేని శివనాథ్
కలసికట్టుగా సమష్టి కృషితో ఎన్‌టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుపుదామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు జిల్లాలో మంచి ఫలితాలతో అమలయ్యేలా కృషిచేయాల్సిన అవసరముందన్నారు. గౌరవ ప్రధాని నేతృత్వంలో వికసిత్ భారత్, గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు, 20 సూత్రాల అమలుకు కృషిచేయడం జరుగుతుందన్నారు. కేంద్రం నుంచి నిధులు, వనరుల సమీకరణ పరంగా కృషిచేయనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
స్వర్ణాంధ్ర పది సూత్రాలకు అనుగుణంగా అడుగులు: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
స్వర్ణాంధ్ర @ 2047 దార్శనిక పత్రంలోని పది సూత్రాలను.. 20 సూత్రాల అమలు కార్యక్రమానికి అనుసంధానిస్తూ లక్ష్యాల సాధనకు జిల్లాస్థాయిలో టీమ్ ఎన్‌టీఆర్ కృషిచేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ
పేదరికం లేని సమాజం మొదలు ఉద్యోగ, ఉపాధి కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ది, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఇంథన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ లక్ష్యాలతో పాటు 20 సూత్రాల అమలుకూ జిల్లా అధికార యంత్రాంగం కృషిచేస్తున్నట్లు తెలిపారు. వచ్చే అయిదేళ్లపాటు 15 శాతం సుస్థిర వార్షిక వృద్ధిరేటు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికలు అమలుచేస్తున్నట్లు వివరించారు. 20 సూత్రాల అమలు కార్యక్రమానికి సంబంధించిన సమీక్షా సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు అన్ని శాఖల పురోగతిని మదించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు దోహదం కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
సమావేశంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ & అదర్ కన్స్ స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.’
Prajavartha Online Telugu News