Breaking News

అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ వహించి సానుకూలంగా పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ వహించి సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కేఆర్ఆర్సి ఎస్డిసి శ్రీదేవిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక– మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు 19,839 అర్జీలు అందగా అందులో ఇంకనూ 2,235 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటన్నిటినీ కూడా సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు.

జిల్లా అధికారులు వారి కార్యాలయంలో పనిచేయుచు న్న సిబ్బంది అందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగుల ఆరోగ్య పథకం ( ఈహెచ్ ఎస్) లో పేర్లు నమోదు చేయించి కార్డులు పొందేలా కృషి చేయాలని అన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ ఆర్ సి ఎస్ )లో సభ్యులుగా చేరి ఇతరులను కూడా చేర్పించాలన్నారు. జిల్లా అధికారులు ఎవరైనా మీకోసం కార్యక్రమానికి రాలేక పోతున్నట్లయితే ముందుగా తన అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాని అధికారులకు కారణాలు తెలపాలని షో కాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. మీకోసం సమావేశం మందిరంలో కొందరు అర్జీదారులు అనవసరంగా గొడవలు సృష్టిస్తున్న దృష్ట్యా వచ్చే సోమవారానికి సీసీ కెమెరాలతో పాటు ఆడియో ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిఆర్వో కు సూచించారు.

కలెక్టరేట్లో మొత్తం 183 అర్జీలు అందాయి. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) సభ్యులు కంచర్ల సుధాకర్,గంధం సైమన్ బాబు, జే.ప్రశాంతి, జ్జుట్టికి రత్న, కోట కిషోర్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం 2011 జనాభా ప్రాతిపదికన ఏబీసీ గ్రూపులుగా చేస్తూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మాదిగలకు సమన్యాయం జరగలేదని, ఎస్.సి. జనాభా కులాల వారీగా గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం మరోసారి క్షుణ్ణంగా కమిషన్ నివేదికను పరిశీలించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

గుడివాడ పట్టణ కాపురస్తులు బాపట్ల కుమారస్వామి మాట్లాడుతూ తన సొంత గ్రామం అయినా మచిలీపట్నం 7 వ డివిజన్, చిలకలపూడి యానాదుల వారి కాలనీ పక్కన ఆర్ఎస్ నంబర్ 414/5 లో తనకు 4501 చదరపు గజాలు ఖాళీల స్థలం ఉందని, ఆ స్థలంలో విద్యుత్ స్తంభాలు, కరెంటు తీగలు మధ్యలో ఉండటం వలన గృహ నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని, ఆ విద్యుత్ స్తంభాలను తొలగించాలని గత రెండున్నర సంవత్సరాలుగా కోరుతున్నా తొలగించలేదని ఇప్పుడైనా తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశారు.

మండల కేంద్రమైన గూడూరుకు చెందిన జడ దావీదు రాజు మాట్లాడుతూ తుమ్మలపాలెం పంచాయతీలో కొత్త తుమ్ములపాలెం ఎస్.సి. కాలనీలో 120 కుటుంబాలు నివసిస్తున్నాయని, నీటి సమస్య ఎక్కువగా ఉందని, వాడుకోవడానికి, పశువులకు గాని ఒక చెరువు కూడా లేదని, తలకటూరు చెరువు నుండి తుమ్మలపాలెం పంచాయతీకి మంచినీరు సరఫరా అవుతుందని, ఎస్.సి. కాలనీ మీదుగా ఒక కిలోమీటర్ పైపులైన్ వెనుకకు రావాల్సి ఉండగా ఒక బిందె నీరు కూడా రావడం లేదని, ఈ సమస్యను గత మూడు నెలలుగా అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఇకనైనా తాగడానికి మంచినీరు ఇచ్చి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అర్జీ అందజేశారు.

మండవల్లి మండలం చింతపాడు గ్రామ కాపురస్తులు ఘంటసాల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాను వ్యవసాయ కూలీనని, గన్నవరం మండలం బుద్ధవరం గ్రామపంచాయతీలో రీ సర్వే నంబర్ 480/4 లో వుడా వారి ఫైల్ నెంబర్ సి 2/1024, ప్లాట్ నెంబర్ 107 దాఖలు ప్రకారం ఇంటి స్థలం కొనుగోలు చేశామని, 2014 నవంబర్ 8వ తేదీన ఈనాడు దినపత్రికలో మెయిన్ పేజీలో విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ నిమిత్తం ప్రచురించబడిన నోటిఫికేషన్లో తన స్థలం కలదని, అయితే పట్టాదారు అనుభవదారుల్లో గొంది ఝాన్సీ లక్ష్మీదేవి అనే పేరు ఉన్నదని, ఆ పేరు స్థానంలో తన పేరు రాసి తన ప్లాటుకు ప్రభుత్వం వారు నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు.

ఘంటసాల మండలం చిట్టూరు గ్రామ కాపురస్తులు రెబ్బ శివరామ ప్రసాద్ మాట్లాడుతూ తనకు చిట్టూరు గ్రామంలో రి సర్వే నెంబరు 42/4, 42/6, 43/9 లో మొత్తం 1.52 ఎకరాలు భూమి కలదని పూర్వం నుండి పంటబోదు గుండా తాను పంట నీరు పెట్టుకొనుచున్నానని,
మల్లిపెద్ది శివాజీ అనే అతను పంట బోదు పూడిక తీయనియకుండ అడ్డుకుంటున్నాడని దీంతో తన భూమికి పంట నీరు పెట్టుకోలేకపోతున్నట్లు తెలియజేస్తూ భూమికి పంట నీరు పెట్టుకొనుటకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు.

గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం పిరికిడు వంతెన గ్రామానికి చెందిన విశాఖ రమాదేవి, పి లక్ష్మి, వి సత్యవతి, వి. సౌజన్య, తాడి కనక లక్ష్మి తదితరులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా విజయ డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నామని, తామందరము నిరక్షరాస్యులమని, గ్రూపు సెక్రటరీ తిరుమలశెట్టి నాగ రమ్య, ఆమె పద్మ లకు ప్రతినెల గ్రూపు సభ్యులు రుణం కంతులు బ్యాంకులో జమచేయుటకు తంచనుగా చెల్లిస్తున్నామని, వాళ్లు మాత్రం ఆ డబ్బు బ్యాంకులో జమ చేయలేదని, ఇలా 7 లక్షల రూపాయల వరకు మోసం చేశారని, తాము కూలీనాలీ చేసుకుని కష్టపడి జీవించే వాళ్ళమని, సంవత్సర కాలంగా వాయిదాలు వేస్తూ జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిసిఈఓ కన్నమనాయుడు, డి ఎస్ ఓ పార్వతి, డ్వామా,డిఆర్డిఏ పీడీలు శివప్రసాద్, హరిహరనాథ్, డిఎంహెచ్వో డాక్టర్ శర్మిష్ట, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్, పంచాయతీరాజ్ ఎస్.ఈ. రమణ రావు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి ఈఈ లు నటరాజు, లోకేష్, ఎల్ డి ఎం రవీంద్రారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *