మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగర పరిధిలోని 432 మంది టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఉగాది రోజున వారి చేతికి తాళాలు అందిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం నగర పరిధిలోని గోసంఘంలోని టిడ్కో గృహ సముదాయాలను సందర్శించారు. గోసంఘం టిడ్కో గృహ సముదాయాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ 2014-19 టిడిపి ప్రభుత్వం హయాంలో ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తీవ్రమైన కృషిచేసి జిల్లాలో టిడ్కో గృహాలను నిర్మించామన్నారు. ఈ నిర్మాణంలో ఎక్కడా కూడా ఇటుకరాయి వాడకుండా నిర్మాణం మొత్తం కేవలం కాంక్రీట్ పోతతోనే అదునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, పటిష్టమైన పునాదితో నిర్మించామని తెలిపారు.
2019లో మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 6,400 గృహాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి అనుమతులు పొందామని, అయితే ఆనాడు 4,176 గృహాలకు పునాదులు వేసినప్పటికీ కొన్ని సమస్యల వల్ల 2,304 గృహాలను పూర్తి చేయగలిగామని, త్వరలో మిగిలిన వాటిని కూడా పూర్తిచేసి అర్హులైన వారికి అందిస్తామన్నారు.
గోసంఘం టిడ్కో గృహ సముదాయాలలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇతర మౌలిక వసతులను కల్పించామని, త్వరలో ఇక్కడ అంగన్వాడి కేంద్రం, పట్టణ ప్రాథమిక కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇల్లు నిమిత్తం నగదు చెల్లించిన లబ్ధిదారులకు ఇల్లు పొందకపోయి ఉంటే వారందరికీ తిరిగి డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామన్నారు.
అదేవిధంగా జిల్లాలోని క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఇతర క్రీడల కోర్టుల్ల నిర్మాణానికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో మల్టీ పర్పస్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
గ్రహ సముదాయాల వద్ద మొక్కలను నాటి కాలనీలో పచ్చదనానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు మంత్రి ఈ సందర్భంగా సూచించారు. అదేవిధంగా కాలనీలోని ప్రజలు సైతం సొసైటీలుగా ఏర్పడి కాలనీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిడ్కో గృహాల ప్రాజెక్ట్ ఆఫీసర్ బి చిన్నోడు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపిచంద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, రామారావు, సుబ్రహ్మణ్యం, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News