గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరధిలో పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ రెడ్డిపాలెం, గోరంట్ల, ఇన్నర్ రింగ్ రోడ్, భారత్ పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుధ్య పనుల కోసం కార్మికుల రేషనలైజేషన్, ప్రత్యేకంగా అదనపు కార్మికులు, వాహనాలు, పుష్ కాట్స్ అందుబాటులో ఉంచామన్నారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో సిబ్బంది, కార్యదర్శుల నిర్లక్ష్యం వలన పలు ప్రాంతాల్లో డంపింగ్ పాయింట్స్ ఉంటున్నాయన్నారు. రెడ్డిపాలెం శ్మశానం వద్ద చెత్త డంపింగ్ చేయడం గమనించి, శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ కాట్ ల ద్వారా సేకరించిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్ తరలించాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో నూతనంగా నిర్మాణం చేసిన సిసి రోడ్లను పరిశీలించి, డ్రైన్ నిర్మాణం చేసిన అనంతరమే రోడ్ నిర్మాణం చేయాలన్నారు. శంకర్ విలాస్ ఆర్ఓబిని పరిశీలించి, బ్రిడ్జిపై డస్ట్ పేరుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ సోమశేఖర్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News