-ధరణి మాత ఆరోగ్య రక్షణ మనందరి సమిష్టి బాధ్యత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మానవాళి సుఖజీవనాభిలాష నానాటికీ పెరుగుతుండటంతో తత్పర్యవసానంగా నిరంతర దాడులకు గురవుతూ సమతుల్యం కోల్పోతూ అనునిత్యం ఆరోగ్య క్షీణతకు గురవుతున్న పుడమి తల్లి మౌనంగా రోదిస్తోంది. మానవాళితో పాటు లక్షలాది రకాల జంతువులు, పక్షులు, మొక్కలకు ఆశ్రయమిచ్చే ధరణి మాత బలహీనమవుతూ బేలగా మారుతోంది. ఎల్లలు లేని గనుల తవ్వకాలు, కనుమరుగవుతున్న పచ్చదనం, మాయమవుతున్న జీవ వైవిధ్యం, అడుగంటుతున్న భూగర్భ జలాలు, కలుషితమవుతున్న నదీ జలాలు, పెరిగిపోతున్న ఎడారీకరణ, విజృంభిస్తున్న వాయు కాలుష్యం, అతివేగంగా సంభవిస్తున్న పర్యావరణ మార్పులు(Climate Change), ఉష్టోగ్రతలు పెరగడంతో కబళించడానికి సిద్ధమవుతున్న సముద్ర జలాలు వంటి సమస్యలు ధరణి మాత ఉనికికి, తద్వారా మానవాళి మనుగడకు పెను సవాళ్లుగా మారుతున్నాయి. ఈ సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని కల్పించి, సమిష్టి కృషితో పర్యావరణ పరిరక్షణ ద్వారా భూ మాతను మరియు మానవాళిని కాపాడుకునే దిశగా ప్రతి ఏడాదీ ఏప్రిల్ 22ను ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం'(World Earth Day)గా జరుపుకుంటున్నారు. పారిశ్రామిక ప్రగతితో ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని ‘ప్రగతి వాసన’ గా భావిస్తున్న తరుణంలో 1970 నుంచి వరల్డ్ ఎర్త్ డే పేరిట పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా సమిష్టి చైతన్య కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఈ ఏడాది ప్రపంచ ధరిత్రీ దినోత్సవానికి ‘మన శక్తి-మన గ్రహం’ అన్న ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. పునరుత్పాదక వనరుల ద్వారా 2030 నాటికి విద్యుదుత్పాదనను మూడు రెట్లు పెంచే లక్ష్యం వైపు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాల్ని ముమ్మరం చేయడం పట్ల దృష్టి సారించేందుకు ఈ విషయాన్ని ఎంపిక చేశారు. కేవలం నేటి సుఖం కోసమే ఆరాటపడకుండా, రేపటి మనుగడ కోసం సుస్థిరాభివృద్ధి విధానాలపై దృష్టి పెట్టి ధరణి మాత మనుగడతో పాటు మానవాళి ఉనికిని కాపాడుకునేందుకు తగు చైతన్యంతో ప్రజలు, ప్రభుత్వాలు దూర దృష్టితో పనిచేయాలి. ఈ దిశగా ఈ ఏడాది ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ సందర్భంగా సమిష్టిగా సంకల్పించాలని కోరుతున్నాను. ధరణి మాత ఆరోగ్యాన్ని రక్షించుకుందాం-మానవాళి ఉనికిని కాపాడుకుందాం.
Prajavartha Online Telugu News