Breaking News

డిస్కంల బలోపేతం, సుస్థిరాభివృద్ధి దిశగా విద్యుత్ రంగం

-విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో కీలక చర్చ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్లో విద్యుత్ రంగ సంస్కరణలపై వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రుల 4 వ సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ పాద యస్సో నాయిక్ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్యుత్ శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగంలో కీలక సంస్కరణల అమలుకు నాంది పలికినట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ పాద యస్సో నాయిక్ మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థితి, యాజమాన్య, నిర్వహణ సమస్యలను అధిగమించడానికి సమన్వయంతో సంస్కరణలు చేపట్టడం ఆవశ్యకమని అన్నారు. దీని కోసం రెగ్యులేటరీ సంస్కరణలు, రుణ పునఃరూపకల్పన, పునరుత్పాదక విద్యుత్ ఇంటిగ్రేషన్, విద్యుత్ స్టోరేజి పరిష్కారాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి విద్యుత్ పంపిణీ వ్యవస్థల బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా టారిఫ్ ల సమీక్ష తోపాటు ఏపీటిఈఎల్ లాంటి సంస్థలను శక్తివంతం చేయడం, టారిఫ్ ఆర్డర్లు, నెట్ మీటరింగ్ విధానాలను సరళీకృతం చేయడం లాంటి చర్యలను చేపట్టడం ద్వారా డిస్కంలను నష్టాల బారి నుంచి గట్టెక్కించవచ్చని సూచించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ విస్తరణకు రూపొందించాలని పేర్కొన్నారు. స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని పేర్కొన్నారు.

రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరా లాల్ నగర్ మాట్లాడుతూ రాజస్థాన్ లో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా 2025-26 నాటికి 36,700 మెగావాట్ల రూప్ టాప్ సోలార్ సామర్ధ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 77 లక్షల మందికి పైగా వినియోగదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

మహారాష్ట్ర మంత్రి మేఘన సకోరే బోర్డికర్ మాట్లాడుతూ మహావితరణ సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందన్నారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు స్థిరమైన పరిష్కారాలకు మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి అరవింద్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్ కు తగిన విద్యుత్ పంపిణి వ్యవస్థను నిర్మించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమని ఇందుకు తక్కువ వడ్డీరేట్లతో ఋణం అవసరమని పేర్కొన్నారు. అధిక ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని, బొగ్గు కేటాయింపులను ఆచరణాత్మక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ రంగానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వం కోసం వ్యయాధారిత టారిఫ్ విధానం అనివార్యమని స్పష్టం చేశారు. అదే విధంగా ఆర్థిక భారం తగ్గించేందుకు డిస్కంలు చేసిన అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఎంపీపీసీఎల్ (మధ్యప్రదేశ్) ఎండీ శ్రీ అవినాష్ లావానియా, ఏఐడీఏ (ఆల్ ఇండియా డిస్కమ్స్ అసోషియేషన్) మరియు మాజీ ఇంధన శాఖ కార్యదర్శి, భారత ప్రభుత్వం డీజీ శ్రీ అలోక్ కుమార్, కేంద్ర ఇంధన శాఖ సంచాలకులు శ్రీ ప్రణవ్ తయల్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అలీ షా, ప్రైవేట్ కార్యదర్శి MoS, శ్రీ మహేశ్ జివాడే, జేఎస్, మినిస్ట్రీ ఆఫ్ పవర్ శ్రీ శశాంక్ మిశ్రా, ఏపీ ట్రాన్స్ కో జేఎండీ శ్రీమతి కీర్తి చేకూరి, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ శ్రీ ఏకేవీ భాస్కర్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇతర ప్రతినిధులు, తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *