-పాకిస్తాన్ దుశ్చర్యను ప్రతి భారతీయుడు ఖండించాలి
-కులం, మతం పేరు చెప్పి చంపడం నీచాతి నీచం
-ఉగ్ర దాడిపై తీవ్రంగా స్పందించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కశ్మీర్ లోని పహల్గాం లో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రదాడిపై రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రంగా స్పందించారు. పహల్గాం లో అమాయకుల ప్రాణాల ను బలిగొన్న ఉగ్రవాదులను గుర్తించి కాల్చి పారేయాలని అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు పహల్గాం లో జరిగిన దుశ్చర్యను ఖండించాలని, దారుణాతి దారుణంగా అరాచకం సృష్టించిన ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో చల్లని ప్రాంతమైన కశ్మీర్లో సంతోషంగా, సుఖంగా, కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపేందుకు వెళ్లిన వారిని టార్గెట్ చేసి చంపడం దుర్మార్గమని అన్నారు. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి , కొత్తగా పెళ్లి చేసుకున్న వారి ని కూడా చంపడం నీచాతి నీచమని అన్నారు.మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి చంపడం భారతదేశంలో ఎప్పుడూ అలాంటి సంస్కృతి లేదని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నేరస్తులకు మతం ఉండదని, ఏ మతానికి చెందిన వారైనా, ఏ సొసైటీ కి చెందిన వారైనా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే తీవ్రంగా స్పందించి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News