-ప్రధాని మోడీ సమర్ధ నాయకత్వంలో భారత వికాసం
-ఆరేళ్లపాటు సమకాలీన పరిస్థితులపై వ్యాసాలు రాసిన మంత్రి సత్యకుమార్ కు ప్రశంసలు
-వ్యాసాల సంకలనం సత్యకాలమ్-2 ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 22న జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ధీటైన జవాబివ్వాలని ఎన్డీయే కూటమి నేతలు ఆకాంక్షించారు. 2016లో ఇదే రీతిన యూరీ ప్రాంతంలోనూ, 2019లో పుల్వామా ప్రాంతంలో జరిగిన దాడులకు ప్రతీకారంగా ప్రభావవంతమైన సర్జికల్ దాడులతో భారత్ జవాబిచ్చిందని, అంతకంటే పదునైన ప్రతీకార చర్యల్ని ఈసారి చేపడతామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, తెదేపా రాష్ట్ర శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. 27 మంది అమాయకుల మృతికి కారణమైన పాకిస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుందని వారన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో 2014 నుంచి ఆవిష్కారమవుతున్న నవ భారతంపై 2019 నుంచి ఆరేళ్లపాటు ప్రతి వారం ఆంధ్రజ్యోతి దిన పత్రికలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ రాసిన వ్యాసాల రెండవ సంకలనాన్ని శనివారం నాడు విడుదల చేసిన సందర్భంగా కూటమి నాయకులు పాకిస్థాన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దేశాన్ని ఎంతో దార్శనికతతో, నిబద్ధతతో, సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ విమర్శలను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. దేశంలో 19 నెలల పాటు ఎమెర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని హరించిన కాంగ్రెస్కు మోడీని నియంతగా పేర్కొనే అర్హత ఏమాత్రమూ లేదని ఆయన అన్నారు. గత 11 ఏళ్ల పాలనలో మోడీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణా లేదని, దీనికి భిన్నంగా కాంగ్రెస్ పాలన చరిత్ర మొత్తం అవినీతి దుర్గంధంలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి తెలిపారు.
మోడీ పాలన విశిస్టతను ప్రజలకు వివరించడం నా బాధ్యత-మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రధాని మోడీ నాయకత్వంలో 2014 నుంచి ఆవిష్కారమవుతున్న నవ భారతం యొక్క వివిధ కోణాల్ని ప్రజలకు వివరించడానికి 2019 నుంచి వ్యాసాలు రాసానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. దేశ సమగ్ర ప్రగతి కోసం, పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి మోడీ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల్ని ఆయన సోదాహరణంగా తెలిపారు. 12 కోట్ల మరుగు దొడ్ల నిర్మాణం, పేదలకు 4 కోట్ల ఇళ్ల నిర్మాణం, అతి తక్కువ కాలంలో 12 కోట్ల ఇళ్లకు రక్షిత మంచినీటి కుళాయిల ఏర్పాటు, స్వయం ఉపాధికి 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాల మంజూరు మోదీ సంకల్పానికి నిదర్శనమని మంత్రి అన్నారు. ప్రధాని మోడీ ఎదుగుదలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ తమ సుదీర్ఘ పాలనలో వివిధ రాష్ట్రాల్లో 77 ఏళ్ల పాటు ఎమెర్జెన్సీని విధించిందని ఎద్దేవా చేశారు. పటిష్టమైన దేశీయ, విదేశీ విధానాలతో భారత దేశం మోదీ నాయకత్వంలో ప్రపంచ శక్తిగా ఎదిగిందని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం రాష్ట్ర వికాసానికి పలు రకాలుగా సాయాన్ని అందిస్తోందని మంత్రి చెప్పారు.
చీకటి నుంచి వెలుగు వైపు- మంత్రి నాదెండ్ల మనోహర్
2019-24 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అంధకారంలోకి నెట్టబడిందని, అట్టి రాష్ట్రాన్ని వెలుగువైపు నడిపించడానికి కూటమి ప్రభుత్వం సర్వ ప్రయత్నాలూ చేస్తోందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్పష్టమైన లక్ష్యాలు, పారదర్శక విధానాలు, సమర్ధవంతమైన పాలనకు ప్రధాని మోడీ ప్రతీక అని, భాజపా నాయకులు ఎంతో నిబద్ధతతో జీవిస్తారని ఆయన అన్నారు. ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి మోడీ రాక- ప్రజల ఆశల సాకారానికి ప్రతీక
రాష్ట్రంలో సమర్ధ నాయకత్వం, ప్రజా రంజక పాలనను అందిస్తోందని గత ప్రభుత్వం మద్యం అక్రమాల వంటి పలు ఆగడాలకు పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందనిచ, ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెదేపా రాష్ట్ర శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వికాసానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో వేలాది కోట్ల రూపాయ ప్రాజెక్టులకు పునాది వేయడానికి మే 2న ప్రధాని రాక రాష్ట్ర ప్రజల ఆశయాల సాకారానికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు.
మంత్రి సత్యకుమార్ కు ప్రశంసలు
ఆరేళ్ల సుదీర్ఘ కాలం పాటు దేశ సమకాలీన, సామాజిక, రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ విషయాలపై పలు కోణాల్లో విశ్లేషణాత్మకమైన వ్యాసాల్ని రాసినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కూటమి నేతలు ప్రశంసించారు. ఒక రాజకీయ నేత ప్రతి వారం ఆరేళ్ల పాటు ఆ రీతిన ప్రజా ప్రయోజనం కోసం రచనలు చేయడం ఇదే మొదటిసారి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు ఇతర నేతలు అభినందించారు.
Prajavartha Online Telugu News