-క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో పటిష్ట సమన్వయం
-కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అకాల వర్షాలపై ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామని, జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో విపత్తుల నిర్వహణ, వ్యవసాయం తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ వీసీకి కలెక్టర్ లక్ష్మీశ జిల్లా కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. వివిధ జిల్లాలకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, ముందస్తు హెచ్చరికలకు అనుగుణంగా జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం తదితరాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విపత్తుల సమయంలో అధికార యంత్రాంగం మానవీయ కోణంలో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని, అకాల వర్షాలను ఎదుర్కొనేందుకు తీసుకున్న సన్నద్ధత చర్యలను వివరించారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో పటిష్ట సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.
Prajavartha Online Telugu News