విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రేషనలైజేషన్ ద్వారా గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ), గ్రామ సర్వేయర్ (వీఎస్), గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఎ) తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. గురువారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ…ఆయా శాఖల ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా సిబ్బందిని తగ్గిస్తూ జీఎస్‌డబ్లూఎస్ జీవో 4 జారీ చేయడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలను జనాభా ప్రాతిపదికన క్లస్టర్ విధానం తీసుకొచ్చి రెండు, మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తూ, ఒక సచివాలయానికి ఒక వీఆర్ఎను లేదా ఒక విలేజ్ సర్వేయర్‌ను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ క్లస్టర్ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,500 మంది వీఆర్వో, 4,722 మంది వీఎస్లను తగ్గిపోతున్నట్టు ఏ సచివాలయంలోను చూపలేదన్నారు. దీనివలన పదోన్నతులకు అర్హులైన వీఆర్ఏలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అర్హులైన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలన్నారు. రెవిన్యూ సమస్యల పరిష్కారాలను సర్వేయర్ లపై రుద్దడం చాలా దారుణమన్నారు. కారణం చెప్పకుండా సిబ్బందిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారన్నారు. వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐలుగా ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదన్నారు. ప్రతి రెవెన్యూ విలేజ్‌కు ఒక వీఆర్వోను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు, రాష్ట్ర కోశాధికారి మౌళి బాషా, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యకులు లక్ష్మీనారాయణ, ప్రసన్నకుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News