గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు యోగాపై అవగాహన కార్యకమాలు చేపడుతుందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఏ.భార్గవ తేజ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుండి లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వరకు యోగాపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, గుంటూరు నగపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025లో గుంటూరు జిల్లా, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనెలా జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు అవగాహన కల్గించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో యోగా శిక్షకులను గుర్తించి, వారి ద్వారా క్షేత్ర స్థాయి వరకు యోగాపై ప్రజలకు తెలియచేస్తామన్నారు. అలాగే పర్యాటక ప్రాంతాలైన ఉండవల్లి గుహలు, మంగళగిరి ఎకో పార్క్ లలో కూడా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్గించడం ద్వారా జూన్ 21 జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చేయడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
గుంటూరు నగపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జూన్ 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశ ప్రధాని పాల్గొంటారని, ఈ నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నెల రోజుల పాటు యోగాని ప్రజలకు చేరువ చేయడానికి వారికి అవగాహన కార్యకమాలు చేపట్టడానికి కార్యాచరణ ఇచ్చిందన్నారు. బుధవారం నుండి నగరంలో వివిధ ప్రాంతాల్లో యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున వైజాగ్ లేదా గుంటూరులో పాల్గొనే ఆసక్తి కల్గిన వారు యోగాంధ్ర వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా.విజయలక్ష్మీ, డిపిఓ డా.సైమన్, డిపిఎం(ఇంచార్జ్) ఎన్ఆర్హెచ్ఎం డా.జయరామ్ కృష్ణ, డెమో జయ ప్రసాద్, డిప్యూటీ డెమో ఎన్.వెంకటేశ్వర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News