మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో 64 లక్షల పింఛన్లు అందజేసి పేద ప్రజలను ఆదుకుంటున్నామని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం గ్రామంలోని స్నేహాలయ వృద్ధాశ్రమంలో, మచిలీపట్నం నగరంలోని చిలకలపూడిలో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులతో కలసి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
తొలుత తాళ్లపాలెం గ్రామంలోని 13వ వార్డులో దివ్యాంగులు వేదాంతం రాజేంద్ర స్వామికి, నత్త దేవ సహాయంలకు 6 వేల రూపాయలు, అమర్లపూడి నారాయణ, కోక వెంకటలక్ష్మిలకు 4 వేల రూపాయల చొప్పున పింఛన్లు అందజేశారు.
అనంతరం మంత్రివర్యులు నగరంలోని 7 వ డివిజన్ లో దివ్యాంగులు హరికృష్ణ బాబుకు 10 వేల రూపాయలు, దివ్యాంగురాలు ఆర్జా రుత్వికకు 6 వేల రూపాయలు, మంచానికి పరిమితమై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్నేపల్లి అప్పలరాజుకు 15 వేల రూపాయల పింఛన్లను అందజేశారు.
అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 2700 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయలను పేద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ల రూపంలో అందజేస్తున్నదన్నారు. ఈ విధంగా దేశంలో ఎక్కడా పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. గతంలో ఉన్న 3 వేల రూపాయల పింఛన్లు 4 వేల రూపాయలకు పెంచి అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన 95 వేల పింఛన్లను తమ ప్రభుత్వం కొత్తగా వచ్చే జూన్ 12వ తేదీన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నామన్నారు. అందులో జిల్లాకు 2800 కొత్త పింఛన్లు మంజూరయ్యాయన్నారు. పింఛను పొందుతూ భర్తలు చనిపోయిన వారి భార్యలకు మరుసటి నెల నుండి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెసులుబాటు కల్పించుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు తల్లికి వందనం పథకాన్ని వచ్చే జూన్ మాసంలో అమలు చేస్తామని, ప్రతి కుటుంబంలో చదువుతున్న పిల్లలందరికీ 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కూడా అమలు చేస్తామన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పింఛన్దారులకు ఇంటి వద్దకే వచ్చి పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని వచ్చే ఆగస్టు మాసం 15వ తేదీన ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందిస్తూ, సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీల మేరకు అన్ని హామీలు నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి అండగా నిలుస్తుందన్నారు.
అంతకుమునుపు మంత్రివర్యులు మంగినపూడి బీచ్ లో మసుల ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. బీచ్ లో ఏర్పాటు చేస్తున్న 100 అడుగుల జాతీయ పతాకం పునాదిని గమనించి ఉత్సవాల ప్రారంభంలోగానే జెండాను ఏర్పాటు చేయాలన్నారు. అమరావతికి ముఖద్వారంగా బీచ్ లో ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. మసులా ఉత్సవాలు ప్రారంభం లోగా అన్ని పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు, మెప్మా పీడీ సాయిబాబు, డి ఆర్ డి ఎ పి డి హరిహరనాథ్, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, తహసిల్దార్ హరినాథ్, స్థానిక ప్రముఖ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, బండి రామకృష్ణ,కుంచే దుర్గాప్రసాద్, మోటమర్రి బాబా ప్రసాద్ తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News