-మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి సమీక్షించిన మంత్రి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం అభివృద్ధిలో కీలకమైన పర్యాటకం, మచిలీపట్నం పోర్టు, పరిశ్రమల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం మంత్రి నగరంలోని స్థానిక రహదారులు భవనాల అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన మచిలీపట్నం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సురక్షితమైన బీచ్ ల్లో ఒకటైన మంగినపూడి బీచ్ ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ కంటే మిన్నగా ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సారి కయాకింగ్, బీచ్ వాలీబాల్ వంటి సరికొత్త క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇవి తప్పనిసరిగా అందర్నీ ఆకట్టుకుంటాయన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాజధానులకు ఈ బీచ్ దగ్గరి ప్రాంతమని, అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అధికారులందరూ అప్పగించిన పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమన్వయం చేసుకుంటూ మసులా బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. గోవా షిప్పింగ్ యార్డు వారు మచిలీపట్నంలో పోర్టు ఆదరిత కార్యకలాపాలు నిర్వహించేందుకు సుముఖం వ్యక్తం చేశారని, త్వరలోనే అందుకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మసులా బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి అధికారులు నిర్వర్తించవలసిన బాధ్యతలపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, ఆ ప్రకారంగా సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆయా తేదీలలో ప్రతిరోజు సాయంత్రం జరుగుతాయని, హెలి రైడ్, వినోద కార్యక్రమాలు, ఆహార పదార్థాలు, సాహస క్రీడలు తదితర కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయన్నారు. క్రీడా కార్యక్రమాలు జరిగే ప్రాంతంలో తప్పనిసరిగా వైద్య శిబిరాలు, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గజ ఈతగాళ్లు, ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ విధమైన విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అవసరం మేరకు ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రాంతాల నుంచి బస్సులను నడపాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే వీఐపీల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, జెడ్పి సీఈవో ఆ బాధ్యతలను చూడాలన్నారు. జూన్ నెల నాలుగో తేదీ లోపు అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ కే చంద్రశేఖరరావు, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, బందరు ఆర్డిఓ కే స్వాతి, ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక, ఈవెంట్ మేనేజర్ ఆనంద్, డి ఆర్ డి ఏ, మెప్మా, ఐసిడిఎస్ పీడీలు హరిహరనాథ్, సాయిబాబు, ఎంఎన్ రాణి, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డిఎం అండ్ హెచ్ వో డాక్టర్ శర్మిష్ఠ, డీఎస్ఓ పార్వతి, డిటిఓ శ్రీనివాసరావు, డిటిడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, మార్క్ ఫెడ్ డిఎం మురళీ కిషోర్, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, వ్యవసాయ, మత్స్య, పర్యాటక శాఖల జిల్లా అధికారులు మనోహర్ రావు, నాగరాజు, రామ లక్ష్మణరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ షాహిద్ బాబు, బీసీ వెల్ఫేర్ అధికారి జీ రమేష్, ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిఎం పెద్దిరాజు, తాసిల్దార్ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News