-ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యత, భౌతిక అక్షరాస్యత అవసరం
-ఆర్థిక సమ్మిళితకు బ్యాంక్ ఆఫ్ బరోడా కృషి అభినందనీయం
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంకు సేవలు ప్రతి పౌరుడికి చేరేలా చూడటం ద్వారా ఆర్థిక సమ్మిళితను (financial inclusion) సాధించవచ్చని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన “ఆర్థిక సమ్మిళితకై సంతృప్త స్థాయిలో ప్రచారం ( financial inclusion saturation campaign) కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ…. గతంలో మనం అక్షరాస్యత గురించి మాట్లాడే వారి మని, కానీ నేడు ఆర్థిక అక్షరాస్యత, భౌతిక అక్షరాస్యత గురించి చర్చించాలని చెప్పారు. ఆర్థిక ఆర్థిక సమ్మిళిత కు ఆర్థిక అక్షరాస్యత అవసరమని అన్నారు. బ్యాంకు ఖాతాను తెరవడం, దానిని కాలానుగుణంగా అప్ డేట్ చేయడం, సురక్షితంగా ఖాతాను నిర్వహించడం వంటివన్నీ ఆర్థిక అక్షరాస్యతలో భాగమని తెలిపారు. 2014లో జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాలను చాలామంది తెరిచారని, అలాంటి వారంతా ఇప్పుడు తమ ఖాతాలకు ఈ కేవైసీ తప్పక చేయించాలని సూచించారు. సాధారణంగా మనం పొదుపు పైనే దృష్టి సారిస్తామని, కానీ బీమా కూడా తప్పక ఉండాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. 20 రూపాయలకే బీమా సదుపాయాన్ని పొందవచ్చని, దీని ద్వారా కష్టకాలంలో 2 లక్షల వరకు సాయం అందుతుందని తెలిపారు. సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బహుమతి గెలుచుకున్నారని తెలిపే సంక్షిప్త సందేశాలలోని లింకులను క్లిక్ చేయవద్దని, అలా చేస్తే ఫోన్ హ్యాక్ అయి సమాచారం నేరస్థులకు చేరుతుందని తెలిపారు. వీడియోలు చూసే సమయంలో వచ్చిన లింకులను, సందేశాలను తెలియకుండానే క్లిక్ చేయడం వల్ల చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారని, ఇందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం అతీతం కాదని చెప్పారు. ఇటీవల కాలంలో ఒక ఉన్నతాధికారి వాట్సప్ ఖాతాను ఫైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని చెప్పారు. సైబర్ మోసాల వారిని పడకుండా సురక్షితంగా తమ ఖాతాను నిర్వహించుకోవాలని, ఫోన్లలో ఎవరికి ఓటీపీలు చెప్పవద్దని సూచించారు.
స్వయం సహాయక బృందాల మహిళలు యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని, వారితో ఏ కార్యక్రమం చేసిన విజయవంతమవుతుందని చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత తో పాటు భౌతిక అక్షరాస్యత కూడా ప్రతి ఒక్కరికి అవసరమని కలెక్టర్ పి ప్రశాంతి చెప్పారు. శరీరానికి అవసరమైన దానిని వ్యాయామం, నృత్యం, ఆటపాటలు రూపేణా అందించడమే భౌతిక అక్షరాస్యతని కలెక్టర్ పేర్కొన్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లలిత్ త్యాగి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికి ఆర్థిక సేవలు అందేలా చూసి ఆర్థిక సమ్మిళితకై సంతృప్తి స్థాయి లో ప్రచారం చేపట్టాలన్న, భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలలపాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భద్రతా పథకాలకు దూరంగా ఉన్న వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి.ఎం.జె.బి వై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పి ఎం ఎస్ బి వై), సవరించిన అటల్ పెన్షన్ యోజన, జన్ ధన్ యోజన పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆర్థిక సమ్మిళిత కు బ్యాంక్ ఆఫ్ బరోడా చేసిన కృషిని, సాధించిన విజయాలను ఆయన వివరించారు.
అనంతరం పి ఎం జె జె బి వై పథకం కింద రెండు లక్షల రూపాయల చెక్కును మృతి చెందిన ఖాతాదారు కొల్లి రాణి కుటుంబ సభ్యులకు అందజేశారు.
పోలీసు శాఖతో బ్యాంక్ ఆఫ్ బరోడా గల ప్రత్యేక ఒప్పందం ద్వారా డిఫెన్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద మృతి చెందిన జిల్లా పెద్ద సోమయ్య బీమా మొత్తం 15 లక్షల రూపాయలను ఆయన భార్య జిల్లా నాగమణికి అందజేశారు. వివిధ స్వయం సహాయక బృందాలకు 20 లక్షల రూపాయలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
ప్రత్యేక ఆకర్షణ గా స్టాల్ల్స్
అంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ శాఖల ఆర్థిక చేయూతతో ఎస్ హెచ్ జి మహిళలు ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. వ్యర్థంగా పారేసే కొబ్బరి పీచుతో ఇంటి అలంకరణ సామాగ్రిని రూపొందించిన హస్త కళాకారులను అభినందించారు. డోలక్ ను వాయించి సంగీత పరికరాల స్టాల్ నిర్వాహకులను మెచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడి లలిత్ త్యాగి, జోనల్ హెడ్ రితేష్ కుమార్, డీజీఎం మురళీకృష్ణ, రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసులు, DRM ఏవి భాస్కరం, డిఆర్డిఏ పిడి మూర్తి, మెప్మా పీడీ ఎం. వెంకటరమణ, ఎల్ డి ఎం డివి ప్రసాద్, నాబార్డ్ డీడీఎం ఆర్ . చక్రధర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ , మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిఐసి జనరల్ మేనేజర్ వాణిధర్, దాదాపు వెయ్యి మంది స్వయం సహాయక బృందాల మహిళలు, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News