మిర్చి ధరల స్థిరీకరణకు ముందస్తు చర్యలు

-మిరప రైతులకు భరోసా….ఇ-క్రాప్ 100% అమలుకు చ‌ర్య‌లు
-రసీదులు, మౌలిక వసతులపై అధికారులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాలి
-మిర్చి సీజన్‌పై ముందస్తు సమీక్ష సమావేశంలో మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి/గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మిర్చి ధరల విషయంలో గతేడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్ష సమావేశం నిర్వహించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో మిర్చి ధరలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. గతేడాది ధరలు అధికంగా ఉండటంతో రైతులు విపరీతంగా మిర్చి సాగు చేశారని, దాని ప్రభావంతో మార్కెట్లో సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు. ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు నిలకడగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా సూచించారని మంత్రి తెలిపారు. గత ఏడాది క్వింటాల్ కు రూ.11,750 మద్దతు ధర ఉందని చెప్పారు. ఈ ఏడాది 44 శాతం వరకు ఉత్పాదకత తగ్గిందన్నారు. క్రయ విక్రయాలకు అనుకూల వాతావరణం ఏర్పాటుకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గత ఏడాది 1.96 లక్షల ఎకరాలలో పండించడం జరిగిందని, ఈ ఏడాది 1.06 లక్షల ఎకరాలలో పండించడం జరిగిందని వివరించారు. డిసెంబర్ నుండి జాన్ వరకు పంట మార్కెట్ కు వస్తుందని తెలిపారు. 13.88 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం ఉందన్నారు. గత ఏడాది 6.62 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉండగా, ఈ ఏడాది 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉందని చెప్పారు. సీజన్ లో 45 వేల నుండి 55 వేల బస్తాలు మొత్తంగా లక్ష  బస్తాలు వస్తాయని తెలిపారు. తేజ రకం మినహా మిగిలిన రకాలకు ధరలు ఆశాజనకంగా ఉందన్నారు. మార్కెట్ ఫీజు రూ.85.37 కోట్లు వసూలైందని తెలిపారు. కొంతమంది రైతులు మిర్చి నుంచి మొక్కజొన్న సాగుకు మళ్లారని తెలిపారు. రైతులు పండించే పంట‌ల‌కు స‌రైన ధ‌ర‌లు రాక ఇబ్బందులు ప‌డుతున్న విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు ప‌రిశీలించి ధ‌ర‌ల‌ను బ‌ట్టి పంట‌ల‌ను పండించేలా ఒక క్ల‌స్ట‌ర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక రూపొందిస్తున్నార‌ని తెలిపారు. వీటిపై రైతుల‌కు పూర్తి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు అదికారులు చేప‌ట్టాల‌ని సూచించారు.

కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న మిర్చికి రుణాలు

ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆదేశించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మిర్చి మార్కెట్ యార్డులకు వస్తోందని, స్థానిక రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా లావాదేవీలపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. మిర్చి సాగు చేసిన రైతుల వివరాలను పూర్తిగా రికార్డు చేస్తున్నామని, నూటికి నూరు శాతం ఇ–క్రాప్ నమోదు జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే నల్లి తామర వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన నివారణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కంప్యూట‌ర్ వెయిట్ మిష‌న్ లు ప్ర‌స్తుతం 100 మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని వాటి సంఖ్య‌ను మ‌రింత పెంచేలా వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారును మంత్రి ఆదేశించారు. రైతుల‌కు త‌ప్ప‌నిస‌ర‌గా ర‌సీదులు అంద‌చేయాల‌ని చేయ‌ని వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. రవాణాకు ధర నిర్ణయించడం జరుగుతుందని, అంతకంటే తక్కువ ధరకు వచ్చిన వారిని అడ్డుకోవద్దని కోరారు. కోల్డ్ స్టోరేజ్ లలో ఉన్న సరుకు కూడా మిర్చి యార్డుకు రావాలని ఆయన స్పష్టం చేశారు.

మిర్చియార్డ్ లో ఇబ్బందులు లేకుండా రైతులకు సౌక‌ర్యాలు

మిర్చి మార్కెట్ యార్డుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు ఏర్పాటు, మరుగుదొడ్లు శుభ్ర‌ప‌ర‌చ‌టం, విశ్రాంతి కొర‌కు బెడ్ షీట్స్ ఏర్పాటు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను మొరుగుప‌ర‌చ‌డం, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఈ సారి సీజ‌న్ ముందుగా రావ‌డం వ‌ల‌న రైతుల‌కు అన్న‌దాన కార్య‌క్ర‌మం ముంద‌స్తుగానే మొద‌లు చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్కెట్ లో ఉన్న పోటీ ధరలు చెల్లించాలని రవాణా సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. ఆకస్మిక వర్షాలు కురిస్తే మార్కెట్ యార్డులో ఉన్న బస్తాలు తడిసి పోతున్నాయని ఇందుకు ప్ర‌త్యాహ్న‌య ఏర్పాట్ల‌ను చేయాల‌ని రైతులు మంత్రిని కోరారు. రైతుల‌కు మేలు చేసేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ఎప్పుడు సిధ్దంగా ఉంటుందని, రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి అచ్చెన్నాయుడు హ‌మీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం. విజయ సునీత, శాసన సభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, డి.సి.సి.బి చైర్మన్ హరిబాబు, ఎగుమతిదారులు, రైతులు, కొనుగోలుదారులు, కమిషన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *